సూక్ష్మ కళల్లో ఆ విద్యార్థిని ప్రతిభతో అబ్బురపరుస్తోంది. భగత్ సింగ్ చిత్రాన్ని రావి ఆకుపై చిత్రించి ఔరా అనిపించింది. అంతేకాదు ఇంకా అనేక చిత్రాలను సూక్ష్మ కళల్లో రాణిస్తున్న ఆ విద్యార్థినిని సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు పేరెంట్స్ అభినందిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు గ్రామంలో శ్రీనివాసులు, మహాలక్ష్మిల కూతురు జి.హిమవర్షిణి. తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. హిమవర్షిణి కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇంతకుముందు పాఠశాల విద్యార్థులు సుద్దముక్కపై శివలింగం, రావి ఆకుపై కార్గిల్ దివాస్ లాంటి చిత్రాలు చేయడంతో తాను ఎందుకు ఇలా చేయకూడదనుకుంది. అంతే రావి ఆకుపై చిత్రాలు వేయాలనుకుంది.
దీంతో డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్. కీర తో ఈ విషయం తెలుపగా, హిమవర్షిణి పట్టుదల, చిత్రలేఖనంపై మక్కువ చూసి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో భగత్ సింగ్ చిత్రాన్ని రావి ఆకుపై ఆవిష్కరించింది. అద్భుతంగా భగత్ సింగ్ చిత్రాన్ని ఆవిష్కరించిన విద్యార్థి హిమవర్షిణి, అందుకు కృషి చేసిన డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్. కీరను ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు చిత్రకళపై మక్కువ చూపాలనే ఉద్దేశ్యంతో వినూత్న పద్దతులలో చిత్రలేఖనం నేర్పిస్తున్నట్లు డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర తెలిపారు. సుద్దముక్క, రావి ఆకు , పెన్సిల్ పై చిత్రాలు ఆవిష్కరింపచేసేలా విద్యార్థులకు తర్ఫీదుని ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక చిన్నారి ప్రతిభను చూసి అందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..