అనకాపల్లి (Anakapalle) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా బీచ్ కు వెళ్లిన విద్యార్థులు అలల ధాటికి గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు గల్లంతవగా.. పవన్ డెడ్ బాడి లభ్యమైంది. గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకు చెందిన సతీశ్, చూచుకొండకు చెందిన గణేశ్, యలమంచిలికి చెందిన చందూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. తేజను బయటకు తీశారు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి డైట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులు పరీక్షలు రాసి, సీతాపాలెం బీచ్‌కు (Seethapalem Beach) వచ్చారు. ఏడుగురు స్నానానికి సముద్రం దిగారు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద అల రావడంతో వీరందరూ సముద్రంలో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న తోటి విద్యార్థులు కేకలు వేయడంతో.. సమీపంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. తేజను కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఈ ఘటనపై మంత్రి అమరనాథ్ స్పందించారు. గల్లంతైన విద్యార్థులను రక్షించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, దేవుడి దయ వల్ల అందరినీ సురక్షితంగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.