DJ Sounds: దద్దరిల్లిన సౌండ్.. డీజే దెబ్బకు కూలిన గోడ.. ఏడుగురికి గాయాలు.. ఎక్కడంటే?

డీజే సౌండ్ సిస్టమ్.. ధావత్‌లు, శుభకార్యాల్లో యువతను ఎంతగా ఉర్రూతలూగిస్తుందో దాంతో అంతే స్థాయిలో అనర్థాలు ఉన్నాయి. గుండెలు అదిరిపోయేలా వినిపించే DJ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ శరీరంలోని నాడీ వ్యవస్థకు ఎంతో ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి డీజే సౌండ్స్‌ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. డీజే సౌండ్స్ వైబ్రేషన్స్‌కు ఓ ఇంటి గుమ్మటం కూలి ఏడుగురు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

DJ Sounds: దద్దరిల్లిన సౌండ్.. డీజే దెబ్బకు కూలిన గోడ.. ఏడుగురికి గాయాలు.. ఎక్కడంటే?
Dj Sound System Dangers

Edited By: Anand T

Updated on: Oct 16, 2025 | 1:15 PM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం బాసూరులో ఏడు నెలల కిందట ఓ పెళ్లి వేడుకలో డీజే సౌండ్ కు డాన్స్ చేస్తూ సుంకరి బంగారు నాయుడు అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఇది ఇంకా మరవక ముందే డీజే కారణంగా తాజాగా జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నరసన్నపేట మండల కేంద్రంలో ఓ ఇంటి గుమ్మటం కూలీ దానికింద ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నరసన్నపేట లోని భవానీపురం వీధిలో నందన్న, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన ఊరేగింపులో ఈ ప్రమాదం జరిగింది.

ఊరేగింపులో డీజే పెట్టారు. ఊరేగింపు నరసన్నపేట లోని భవానిపురం వద్దకు వచ్చేసరికి డీజే సౌండ్ లకు కుర్రకారు డ్యాన్స్ లు చేస్తుండగా.. స్థానికులు గుమికూడి కార్యక్రమాల్ని వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో DJ సౌండ్స్ కు తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చాయి. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి గుమ్మటం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో గుమ్మటం కింద నిలబడి ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించి వాటి కింద ఉన్న వారినీ బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు వారి పరిస్తితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని శ్రీకాకుళం లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించారు.

స్థానికుల సమాచారంతో విషయం తెలసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. భారీ డీజే సౌండ్, దాని వైబ్రేషన్‌ కారణంగానే గొడ కూలినట్టు స్థానికులు చెప్పడంతో డీజే సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు ఈ డీజే సౌండ్స్ పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించాయి. పల్లెల్లో డీజే లేకపోతే కార్యక్రమంలో ఏదో వెలితి ఉన్నట్టు ఫీల్ అయ్యే పరిస్థితులు దాపురించాయి. అయితే డీజేల కారణంగా చాలా చోట్ల మనుషుల ప్రాణాలు సైతం పోతుండటంతో వీటిని పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.