తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తోన్న ఈ ట్రైన్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రారంభించారు. ఇది దక్షిణాదిన రెండో వందేభారత్ రైలు కాగా.. త్వరలోనే మరో ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోంది.
నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలును ప్రారంభించే దిశగా కేంద్ర రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే ఇది పరుగులు పెడుతుందని సమాచారం. ఈ ట్రైన్‌ను సికింద్రాబాద్ నుంచి వయా నడికుడి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదగా తిరుపతి చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించి ట్రయిల్ రన్ కూడా పూర్తయింది. మరి ఈ ట్రైన్‌లో టికెట్ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి మధ్య దూరం 699 కిలోమీటర్లు.. 8.30 గంటల్లో వందేభారత్ ట్రైన్ ఈ దూరాన్ని చేరుకుంటుంది. అలాగే ఈ రెండు నగరాల మధ్య ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 1720 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 3,170గా నిర్ణయించారు. దీన్ని బట్టి క్యాలికులేట్ చేస్తే.. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య 661 కిలోమీటర్ల దూరం.. దీన్ని వందేభారత్ రైలు సుమారు 8 గంటల్లో చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే సికింద్రాబాద్-వైజాగ్ రూట్‌కు ఉన్న టికెట్ ధరలకు.. రూ. 100-150 అటూ.. ఇటూగా సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్ రేట్లు ఉంటాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీ చైర్ కారు రూ. 1610, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు రూ. 3050గా ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.