
ఏపీలో కొత్త రకం వ్యాధి హడలెత్తిస్తోంది..స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చనిపోవడం సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతందంటున్నారు డాక్టర్లు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడం, జ్వరం, వాంతులు,తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. అసలు ఏంటీ స్కబ్ టైఫస్. లాలాజలంతో మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.అలాగని ఈ ఇన్‌ఫెక్షన్ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదంటున్నారు వైద్యులు. తేమ ఎక్కువగా వున్నచోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుందన్నారు. ఏపీలోస్క్రబ్ టైఫస్ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగడం ఆందోళన కల్గిస్తోంది. ఐతే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంప్, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు.
నలుసు లాంటి నల్లే కదా అని లైట్‌గా తీసుకోవద్దు. సకాలంలో స్పందించకుంటే, సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం వుంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు సహా కిడ్నీ సమస్యలు రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6నుంచి 30శాతం ఉండే అవకాశం వుంది. స్క్రబ్ టైఫస్‌కి వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2శాతం లోపు తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు. ఓ వైపు దోమలు తెగ కుట్టేస్తున్నాయ్. సందట్లో సడేమియాల్లా ఇప్పుడు నల్లులు కూడా కుడుతున్నాయ్. మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు.. కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాలమీదికి తెస్తుంది. అలాగని జ్వరంరాగానే అదేనేమో అని భయపడాల్సిన పన్లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. బీఅలర్ట్.