తిరుపతి, సెప్టెంబర్ 5: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లైంగిక ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం ఈ రోజు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్‌లో ఓ మహిళ మీడియా ముందుకొచ్చి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ గంటల వ్యవధిలోనే ఆయనను సస్పెండ్ చేసింది. ఆదిమూలంపై వచ్చిన ఆరోపణలను ఆయన కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై కావాలనే కొందరు టీడీపీ శ్రేణులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలపై తాజా ఆయన స్పందించారు. టీవీ9కు ఫోన్ లో వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఈ విధంగా మాట్లాడారు.. ‘ నేను ఏ తప్పు చేయలేదు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కుట్ర పన్నారు. ఎన్నికల్లో టికెట్ వచ్చినప్పటి నుంచే నాపై కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో టీడీపీ పేరు చెప్పుకునే వారితోపాటు వైసీపీలోని కొందరు పెద్దలు కూడా ఉన్నారు. మహిళా నాయకురాలిని వాడుకుని నాపై మచ్చ వేశారు. నాపై ఈర్ష్య, ద్వేషం, కోపంతో ఈ నింద వేశారు. చాలా భాద కలిగిస్తోంది. నాపై నింద వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఆమెను వేధించి ఉంటే భగవంతుడే చూసు కుంటాడు. నాకు ఓటు వేసి ఆదరించిన సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు నేను జవాబుదారీని. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగరాదు. 50 ఏళ్లు రాజకీయం చేసిన వాడ్ని న్యాయం ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. ఇక దీనిపై రాజకీయ నేతలెవ్వరూ పెదవి విప్పక పోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.