హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వీడియో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మరో సారి స్పందించారు. ఈ వీడియోపై విచారణ జరుగుతోందని, నిందితులెవరైనా సరే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ (TDP) వెంటిలేటర్ పై చేరుకుందని ఆక్షేపించారు. అధికారంలోకి వస్తామని వాళ్లకు వాళ్ళే సెల్ఫ్ ఇఫ్నాటిజం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడానికి షార్ట్ కర్ట్ ఉండదని చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు. టీడీపీని బ్రతికించడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఢిల్లీ వెళ్లి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీతో ఒక ఫోటో దిగి హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని తమతో సానుకూలంగా వ్యవహరించారన్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణలో ఉపయోగపడేలా చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నారని.. 2019 లో రాహుల్ గాంధీతో చంద్రబాబు చేతులు కలిపిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు రిజెక్ట్ చేసి మూడేళ్లు అయ్యిందన్న సజ్జల.. 2024 లోనూ అదే రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు.
వీడియో అసభ్యంగా ఉన్నా నాలుగు గోడల మధ్య జరిగింది. అవతల ఎవరున్నారో తెలియదు. మార్ఫింగ్ కాదని తేలితే కచ్చితంగా చర్యలు ఉంటాయి..గంటలో రిపోర్టు వస్తుంది అని టీడీపీ నేతలు చెప్తున్నారు. 2015 లో ఓటుకు నోటు వీడియో ఆడియో రిపోర్ట్స్ ఇప్పటికీ ఎందుకు రాలేదు. ఐదేళ్లు ఎందుకు సమయం పట్టింది. చంద్రబాబు వాయిస్ కి సపోర్టుగా రేవంత్ రెడ్డి వీడియో కూడా దొరికింది. ఓటుకు నోటు జరిగి 7 ఏళ్లు అయ్యింది. కానీ చంద్రబాబు ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థని దెబ్బతీసేలా మాట్లాడారు. అంబటి, అవంతి వాయిస్ లకు ఆధారాలు లేవు. అవతల వారి నుంచి పిర్యాదులూ రాలేదు. ఎక్కడెక్కడో వాయిస్ లు కలిపి ట్రోల్ చేస్తున్నారు.
– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
కాగా.. గతంలోనూ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సజ్జల స్పందించారు. ఎంపీ వ్యవహారంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఎంపీని వివరణ కోరితే దాన్ని ఆయన ఖండించారని, వీడియోపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని చెప్పారు. చట్టపరమైన విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఎంపీపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి