Godavari River Pollution: గోదావరిలో ఇప్పుడు మునిగితే… నేరుగా గోదారికే!

పుష్కరాల గోదావరి... ఇప్పుడు కాలుష్య గోదావరిగా మారుతోందా? ల్యాబ్ నివేదికలో బయటపడిన సంఖ్యలు చూస్తే పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. నదిని కాపాడకపోతే అది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు... కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, జీవనాధారంపై ప్రభావం చూపే సంక్షోభంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికను ఈ నివేదిక మరోసారి గుర్తు చేసింది.

Godavari River Pollution: గోదావరిలో ఇప్పుడు మునిగితే... నేరుగా గోదారికే!
Godavari River Pollution

Edited By:

Updated on: Jun 09, 2026 | 9:05 AM

పవిత్ర గోదావరి.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతి పుష్కరానికి లక్షలాది మంది స్నానాలు చేసే మహానది. కానీ ఇప్పుడు అదే గోదావరి గురించి బయటకు వచ్చిన ల్యాబ్ నివేదికలు కలవరపెడుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా బోటులో వెళ్లి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ ప్రాంతాల నుంచి నీటి నమూనాలు సేకరింపజేశారు. ఆ నమూనాలను అత్యాధునిక సాంకేతికతతో పరీక్షించగా బయటపడ్డ వాస్తవాలు అధికారులను సైతం షాక్‌కు గురి చేశాయి. స్నానాలకు అనువుగా ఉండాల్సిన గోదావరి నీటిలో ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు, రసాయన అవశేషాలు, బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను నిలదీశారు. అసలు గోదావరిలో ఏమి జరుగుతోంది?ల్యాబ్ నివేదికలో బయటపడిన నిజాలేంటి? ఒకసారి చూద్దాం..

గోదావరిలో ప్రమాద ఘంటికలు

గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా స్నానాలకు అనువైన నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా 500 MPN/100ml లోపు ఉండాలి. కానీ కోటిలింగాల ఘాట్ వద్ద ఇది ఏకంగా 2420 MPN/100ml గా నమోదైంది. అంటే అనుమతించదగిన స్థాయి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఈ స్థాయిలో బ్యాక్టీరియా ఉండటం అంటే మురుగునీరు నేరుగా నదిలో కలుస్తోందనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.

జలచరాలకు ముప్పు, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం

నీటిలో కాలుష్యాన్ని సూచించే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) పరిమితి 3 mg/L ఉండాలి. కానీ గోదావరిలో అది 5.2 mg/Lగా నమోదైంది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి చేపలు, ఇతర జలచరాల మనుగడ ప్రమాదంలో పడుతోంది. మరోవైపు నైట్రేట్ స్థాయి 45 mg/L లోపు ఉండాల్సి ఉండగా 119.6 mg/Lగా నమోదైంది. ఈ స్థాయిలో నైట్రేట్లు ఉండటం వల్ల చిన్నపిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ల్యాబ్ నివేదిక హెచ్చరించింది. కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్‌లో బయటపడిన నిజాలు

గోదావరిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ వద్ద సేకరించిన నమూనాల్లో సల్ఫైడ్, ఫాస్ఫేట్, ఇతర రసాయనాల స్థాయిలు పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. సల్ఫైడ్ స్థాయి 2 mg/L ఉండాల్సి ఉండగా 3.4 mg/Lగా నమోదైంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 30 mg/L లోపు ఉండాలి. కానీ 36 mg/Lగా నమోదైంది. ఈ పరిస్థితి కొనసాగితే జలచరాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

అధికారులపై ఆగ్రహం, నోటీసులు

ల్యాబ్ నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందే గోదావరి ఇంతగా కలుషితమవుతున్నా ఇన్ని రోజులుగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.

కార్మికుల కోసం మరో అవకాశం

చట్టప్రకారం చూస్తే ఆంధ్ర పేపర్ మిల్లుపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే ఫ్యాక్టరీని మూసివేయవచ్చు కూడా. అయితే వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణ చర్యలను వెంటనే అమలు చేయాలని, వ్యర్థ జలాల శుద్ధి వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించింది. అదే సమయంలో గోదావరిలో ఒక్క చుక్క మురుగునీరు కూడా కలవకుండా శాశ్వత పరిష్కారానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us