Rythu Bharosa Centers: ఆంధ్రప్రదేశ్ లో రైతుభరోసా కేంద్రాలను మినీ బ్యాంకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే రూ.20 వేల వరకు నగదు విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్ సదుపాయం బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా లావాదేవీలు అనేక ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. రూ.20 వేలు వరకూ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్, డిపాజిట్ వంటి సేవలను ఆర్‌బీకేలలోనే పొందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఐదు వేల జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంక్ లు బ్రాంచ్‌లు నెలకొల్పాలి.
అయితే బ్రాంచీల ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్లను నియమించుకుని సేవలు అందిస్తున్నాయి. అయితే అన్ని గ్రామాల్లోనూ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌బీకేలలో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పలు జిల్లాల్లో గత నెల 9 నుంచి ఆర్‌బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు. దీని కోసం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) ఏర్పాట్లు చేశారు. వీటి పనివేళలను కూడా త్వరలోనే నిర్ణయించనున్నారు. బ్యాంక్‌లు ఇచ్చిన స్వైపింగ్ మెషీన్లు, ట్యాబ్‌ల ద్వారా కరస్పాండెంట్లు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఇక, రైతు భరోసా కేంద్రాలలో బిజినెస్ కరస్పాండెంట్లు అందించే బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పటికే ఆర్‌బీకేల మ్యాపింగ్ చేయడం పూర్తయింది. ఈ సేవలను రైతులు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లతోపాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు.
Read also: రాయలసీమ టీడీపీ నేతల ఉడుం పట్టు.. అనంత వేదికగా జలాల పోరుకు సరికొత్త తీర్మానం