కాకినాడ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నారని తెలిసింది. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ అనే మహిళకు ముగ్గురు కుమారులు. దుర్గ, ఆమె కుమారులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పని కోసమని నర్సీపట్నం వెళ్లిన తల్లీ కొడుకులు.. బైక్‌పై స్వగ్రామానికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గండేపల్లి మండలం మురారి శివారులో వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పడంతో వారంతా కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి పైనుంచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో దుర్గ కుమారులు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..