Krishna Water Level: కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కృష్ణాజిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీకి రేపు మధ్యాహ్నానికి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంటుందని అంచనాలు ఉండటంతో లంక గ్రామాలకు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారమిచ్చారు.
నదిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ పనులు సైతం సాగుతున్నాయనీ.. ముంపు బాధితులను కేటాయించిన ఇళ్లకు తరలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇలా ఉండగా, అటు, నాగార్జున సాగర్ జలాశయానికి సైతం వరద ఉధృతి కొనసాగుతోంది. తాజాగా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోంది. దీంతో 569 అడుగులకు సాగర్ డ్యామ్‌లో నీటి నిల్వ చేరుకుంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 233 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరో నలబై గంటల్లో జలాశయానికి గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశముంది. ఆ తర్వాత ఏ క్షణమైనా డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశముంది. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని నాగార్జున సాగర్ ఎస్ఈ ధర్మానాయక్ టీవీ9కు వెల్లడించారు.