Rare Flower: ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి. మాములుగా బ్రహ్మ కమలం ఒక పువ్వు పూసిందంటేనే జనం ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక బ్రహ్మకమలం మొక్కకి ఏకంగా పదుల సంఖ్యలో పుష్పాలు పూయడం నిజంగా అద్భుతం. ఈ అద్భుత దృశ్యం తూర్పు గోదావరి జిల్లాలో ఆవిష్కృతమైంది. జిల్లాలోని బిక్కవోలులో బ్రహ్మకమలం మొక్క విరగబూసింది. ఒకే ఒక్క మొక్క 80 పూసింది. చెట్టు నిండా పూసిన పూలు ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తున్నాయి. ఒకేసారి అన్ని బ్రహ్మ కమలాలు వికసించడంతో అక్కడ సందడి నెలకొంది.
బిక్కవోలు గ్రామానికి చెందిన మామిడిశెట్టి సూర్యనారాయణ ఈ చెట్టుకు ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బ్రహ్మకమలాలు ఒకేసారి 80 పూలు పూయటంతో ఆ ఇంటివారు భక్తితో పూజలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానిక ప్రజలు సైతం మొక్కను చూసేందుకు ఆసక్తిగా తరలివస్తున్నారు. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాలు చూసేందుకు జనాలు ఎగబడ్డారు.. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇళ్లల్లో బ్రహ్మ కమలాలు విరబూస్తున్నాయి. కానీ ఏకంగా 80 పుష్పాలు పూయడం చర్చనీయాంశమైంది. కొన్ని మొక్కలకు మాత్రమే ఇలా భారీ పుష్పాలు వికసిస్తాయి స్థానికులు అంటున్నారు.