Kadapa News: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొత్త సమస్య..

|

Dec 09, 2021 | 6:09 PM

Andhra Pradesh flood victims: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతేరిపిలేకుండా కురిసిన వర్షాలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని

Kadapa News: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొత్త సమస్య..
Rajampet Flood Victims
Follow us on

Rajampet flood victims: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతేరిపిలేకుండా కురిసిన వర్షాలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. చాలామంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో కడప జిల్లాలోని రాజంపేట వరద బాధితుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారింది. ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులై రోడ్డుపై పడ్డ వారికి కరెంటు బిల్లులు ఇవ్వడంతో పుండుమీద కారం చల్లినట్లయింది. తమ పరిస్థితి తెలిసినా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రాజంపేట మంజలంలోని 18 గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇళ్లు, ఉపాధి కోల్పోయి తాము బాధపడుతుంటే.. కనీసం కనికరం లేకుండా ప్రభుత్వ అధికారులు తమకు కరెంటు బిల్లులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

రాజంపేట చెయ్యేరు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు కరెంట్ బిల్లుల మోత పెను భారంగా మారింది. దీంతో ఎగువ, దిగువ మందపల్లె, పులపత్తూరులోని బాధిత కుటుంబాలు లబోదిబోమంటున్నారు. వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయి దాతలు ఇచ్చిన బట్టలు, ఆహారంతో పూట గడుపుతున్నామని.. ఈ పరిస్థితుల్లో తాము విద్యుత్ బిల్లులు ఎలా కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదేనా తమని ఆదుకునే తీరు అని స్థానిక ప్రజల ఆవేదన చెందుతున్నారు.

వరదలతో ఇప్పటికీ బాధలు పడుతున్నామని.. ఈ పరిస్థితుల్లో తాము విద్యుత్ బిల్లులు కట్టలేమంటున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని చెయ్యేరు వరద బాధితులు కోరుతున్నారు. ఇంకా కోలుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని.. వరదల నుంచి నెల గడవకముందే ఇలా బిల్లుల రూపంలో భారం మోపితే తట్టుకోలేమని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

 

సుధీర్, టీవీ9 తెలుగు, కడప

Also Read:

Lance Naik Sai Teja: దేశం ముద్దుబిడ్డ.. నిను మరవదు ఈ గడ్డ.. సాయితేజకు సెల్యూట్

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి