AP – Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురిసిన వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమ, కోస్తాఆంధ్రా ప్రాంతాలు వర్షాల నుంచి ఇంకా తేరుకోలేదు. పలుచోట్ల వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. తూర్పు దిశ నుంచి ఏపీ, తెలంగాణ వైపు వీస్తున్న గాలులతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ద్రోణి శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా.. తెలంగాణలోని హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు జిల్లాల వాసులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పలుచోట్ల ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈనేపథ్యంలో మళ్లీ వర్షాల సూచనలతో ప్రజలు భయాందోన చెందుతున్నారు.
Also Read: