Andhra Pradesh: గ్రామీణ ప్రాంత ప్రజలు సాధారణంగానే మూఢ నమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. దేవుళ్లకు బలి ఇవ్వడం, రకరకాల పూజలు చేస్తుంటారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. వర్షాల కోసం చాలా ప్రాంతాల్లో ప్రజలు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. వింత వింత కార్యక్రమాలు చేపడుతారు. వర్షాలు కురవడం కోసం యజ్ఞ యాగాలు చేస్తుంటారు. మరికొందరైతే.. తమ తమ సంప్రదాయం, తమకు తెలిసిన నమ్మకాల ప్రకారం కప్పదాట్లు, జంతువులకు పెళ్లి చేయడం వంటి పూజలు నిర్వహిస్తుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం వెలుగు చూసింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అక్కడి ప్రజలు గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ మండలం.. హోసూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హోసూరు గ్రామ ప్రజలు వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇందులో బాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. అనంతరం ఊరంగా ఊరేగింపు నిర్వహించారు అక్కడి రైతులు. హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే.. అచ్చం మనుషులకు ఎలాగైతే పెళ్లి తంతు నిర్వహిస్తారో.. గాడిదలకు కూడా అలాగే నిర్వహించారు. అయితే, గతంలో కూడా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు విస్తారంగా కురిసాయని, అందుకే ఈ సంవత్సరం కూడా గాడిదలకు పెళ్లిళ్లు చేస్తున్నామని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ గాడిదల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ పెళ్లి చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం చేస్తున్న వీరి ప్రయత్నం వింతగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ.. ఈ మూఢ నమ్మకాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఎవరి విశ్వాసాలు వారివి అంటూ గ్రామస్తుల చర్యను సమర్థిస్తున్నారు.
Also read:
Andhra Pradesh: అలా చేయడం సరికాదు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని..
Ganesh Immersion: ఆ ఊర్లో తాబేళ్లపై ఊరేగుతున్న బొజ్జ గణపయ్య.. చూడముచ్చటైన వీడియో మీకోసం..