Andhra Pradesh: ఏపీలో హీటెక్కుతున్న రాజకీయం.. ఓ వైపు అభివృద్ధి మంత్రం.. మరోవైపు అరాచక నినాదం..

|

Sep 23, 2022 | 11:02 AM

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు మరో 20 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటినుంచి అక్కడి పొలిటికల్ క్లైమట్ హీటెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంటే. సర్వశక్తులు ఒడ్డి వైసీపీని ఓడించడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. రోజురోజుకు ఏపీలో..

Andhra Pradesh: ఏపీలో హీటెక్కుతున్న రాజకీయం.. ఓ వైపు అభివృద్ధి మంత్రం.. మరోవైపు అరాచక నినాదం..
Tdp, Ycp, Janasena
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు మరో 20 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటినుంచి అక్కడి పొలిటికల్ క్లైమట్ హీటెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంటే. సర్వశక్తులు ఒడ్డి వైసీపీని ఓడించడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. రోజురోజుకు ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ప్రజల్లో ఉందని, ఇదే తమను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తుందని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. బీజేపీ మాత్రం టీడీపీ, వైసీపీ రెండు పార్టీలపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, తమకు అవకాశం ఇస్తారనే ఆశా భావం వ్యక్తం చేస్తున్నప్పటికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆపార్టీకి అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి. పార్టీ పరంగా ఓటు బ్యాంకు ఉన్నప్పటికి.. సొంతంగా కమలం పార్టీ గెలవడం కంటే.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం కలిగే పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఇక జనసేన పార్టీ మాత్రం కొన్ని జిల్లాల్లో ప్రజాబలం కలిగి ఉన్నప్పటికి, మరికొన్ని జిల్లాల్లో ఆపార్టీకి చెప్పుకోదగ్గ బలం లేదు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికి, ఎన్నికల నాటికి జనసేనాని ప్రయాణం ఎటువైపు ఉంటుంది. లేదా ఒంటరిగా వెళ్తారా అనేది ఓ చిక్కు ప్రశ్న. జనసేన ఒంటరిగా పోటీచేయడానికి కంటే కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సమయానికి జనసేన తమతో కలిసి వస్తుందనే ఆశతోనే ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎలాగైనా వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే తమ తుది లక్ష్యమంటూ చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోనని గతంలోనే వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యలే తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్తుందనే ప్రచారానికి బలం చేకూర్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీకి గట్టిపోటీ తప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా ఎవరి దారి వారిదే అన్నట్లు టీడీపీ, జనసేన, బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే వైసీపీ అలవోకగా విజయం సాధిస్తుందనే చర్చ వినిపిస్తోంది.

టీడీపీ, జనసేన కలవకుండా ఉంటేనే తమకు మేలనే ఉద్దేశంలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు 20 నెలల సమయం ఉన్నప్పటికి.. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఇప్పటి నుంచే యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తోలగించి, డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈఅంశంపై టీడీపీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంది. ఓ రకంగా ఎన్నికల వరకు ఈ అంశాన్ని లైవ్ లో ఉంచాలనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. సడన్ గా వైసీపీ ప్రభుత్వం ఈనిర్ణయం ఎందుకు తీసుకుందనేది ఎవరికి అంతుపట్టనప్పటికి.. దీని వెనుక రాజకీయ కారణాలు, గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఉన్నట్లు సమాచారం. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్డీఆర్ పేరు తొలగింపు ఏపీ వ్యాప్తంగా కాకరేపుతోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాన పార్టీలు తమదైన కార్యచరణను రూపొందించుకుని ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఓ వైపు పాలనపై దృష్టిపెడుతూనే, పార్టీ కార్యకలాపాలపై కూడా జగన్ దృష్టి పెడుతున్నారు. అలాగే తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధే తమను గెలిపిస్తాయని వైసీపీ నమ్ముతోంది. దీనినే ప్రచార అస్త్రంగానూ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కోసం వివిధ పథకాలను అమలు చేస్తూ.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయాన్ని జమచేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే ప్రభుత్వ ప్రచారానికి ధీటుగా ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీలు బీజేపీ, జనసేన కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేయడంతో పాటు, వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు ఎక్కువ అయపోయాయంటూ.. ఇదో అరాచక ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు. అధికార, ప్రతిపక్షాలు పోటీపోటీగా తమ అజెండాతో ముందుకెళ్తున్న క్రమంలో ప్రజలు ఎవరిని విశ్వసిస్తారనేది భవిష్యత్తులో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..