
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎయిర్ పోర్ట్ ఘటన కేసులో ఇద్దరు జనసేన నేతలు సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్. రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది వరకు జన సేన నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొంత మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో మంత్రులు రోజా, జోగి రమేష్ లతో పాటు వైవీ సుబ్బా రెడ్డిల వాహనాలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. అభిమానులు ఎవరూ అటు వైపు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ ఉదయం 9 గంటలకు పోర్ట్ కళావాణి స్టేడియంలో జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సాయంత్రం వరకు జనవాణి కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. ఎయిర్ పోర్ట్ ఘటన పై నగర పోలీస్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.
200 నుంచి 300 మంది వరకు జనసేన నేతలు ఎయిర్ పోర్ట్ వద్ద గుమిగూడారు. మంత్రి రోజా తో పాటు వైస్సార్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బారులుగా గుమిగూడి రాళ్లతో, పార్టీ జండా కర్రలతో, పదునైన ఇనుప వస్తువులతో చంపాలనే ఉద్దేశంతో దాడి చేసి బలమైన గాయాలు చేయారు. ప్రజాశాంతి కి భంగం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కూడా జరిగింది. ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ఈ నిబంధనలను అతిక్రమించారు. జనసైనికుల చర్యలతో ఎయిర్పోర్ట్ వద్ద ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యారు. 30 మంది వరకు ప్రయాణికులు నిర్ణీత సమయంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకోలేక విమానాలు మిస్ చేసుకున్నారు. బాధ్యులైన జనసేన నాయకులూ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు ప్రారంభించాం.
– విశాఖపట్నం నగర పోలీసులు
కాగా.. ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం జనసేనపై మండిపడ్డారు. జనసైనికులు కాదు.. జన సైకోలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ కాదు.. ఫ్లవర్ స్టార్.. అంటూ అమర్‌నాథ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ స్పందించి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి