
ప్రధాని తెలంగాణ పర్యాటన ముగిసింది. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం చేసిన నరేంద్ర మోదీ ఆ తర్వాత, పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూనే మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై తనదైన శైలిలో అటాక్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలని ఘూటా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొందరు కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని మోదీ దుయ్యబట్టారు.
ఇక అంతకు ముందు మోదీ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించే ఆప్యాయత ఎనలేనిదని ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలుగు ప్రజలు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు.
కొన్ని నెలలక్రితం తాను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలకోసం రాష్ట్రానికి వచ్చానని, మరోసారి అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. భారత్ ఎన్నో అడ్డుగోడలు బద్దలు కొట్టి అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. దేశం ప్రపంచ గమనానికి కేంద్రం అవుతోందని తెలిపారు ప్రధాని మోదీ. విశాఖ పర్యటనను విజవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు పయనమవనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా రామగుండం వెళ్లనున్నారు. అక్కడి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
రామగుండంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘రైతుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశాము. రానున్న రోజుల్లో మరో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాం. బొగ్గు గనుల విషయంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు. సింగరనేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటానే ఉంది. ప్రైవేటీకరణ చేయడం కేంద్రం చేతిలో లేదు. గతంలో బొగ్గు గనుల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు గనుల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చారు.
రామగుండంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ తన స్పీచ్‌ను తెలుగులో మొదలు పెట్టారు. సభకు విచ్చేసిన రైతులు, సోదర సోదరీమణులకు నమస్కారములు అంటూ మోదీ స్పీచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ ఒక్కరోజులోనే రూ. 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించాం. రైల్వేలు, రోడ్ల ప్రాజెక్ట్‌ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయి. గత రెండున్నరేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం. కరోనాతో పాటు యుద్ధాల వల్ల సంక్షోభం వచ్చింది. ఈ కష్టకాలంలోనూ దేశంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. అనంతరం భద్రాచలం నుంచి సత్తుపల్లి రైల్వే లైన్‌ను సైతం మోదీ జాతికి అంకితం చేశారు. 3 నేషనల్ హైవేలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వీటికి రూ. 2,268 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. వీటిలో ఎల్కతుర్తి-సిద్ధిపేట-మెదక్, సిరొంచ-మహదేవ్‌పూర్, బోధన్-భాసర్ హైవేలు ఉన్నాయి.
తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాక్టరీతో రాష్ట్రంలో ఎరువుల కొరత తీరుతుంది. యూరియా బస్తాపై కేంద్రం రూ. 1470 సబ్సిడీ అందిస్తోంది. వ్యవసాయం అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. రూ. 6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. గతంలో ధాన్యం కొనుగోలు కోసం కేటాయించింది కేవలం రూ. 3,404 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ. 2,040కి పెంచాము. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నాం అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదు’ అని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం నేరుగా రామగుండం చేరుకున్నారు. ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ప్లాంట్‌ను సందర్శించనున్న మోదీ అనంతరం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం ఇవ్వనున్నారు. ఆ తర్వాత సభలో మాట్లడనున్నారు. ఈ సభ సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభం కానుంది.
మోదీని తిట్టినంతమాత్రన తెలంగాణ అభివృద్ధి జరగదని మోదీ అన్నారు. ఆన్ లైన్ పేమెంట్స్‌తో అవినీతికి అడ్డుకట్టపడుతుందన్నారు. అవినీతి పరులను వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. కార్యకర్తలు కేత్రస్థాయిలో మరింత కష్టపడి పనిచేయాలని దాని ఫలితాలు త్వరలోనే చూస్తారన్నారు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి శనివారం మద్యాహ్నం తెలంగాణ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ఎయిర్ పోర్ట్ లో సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘భయంతో నన్ను తిట్టే వాళ్లు ఇక్కడ ఉన్నారు, వాటి గురించి కార్యకర్తలు ఎవరూ చింతించవద్దు.. ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేయండి. 25 ఏళ్లుగా నాకు చాలా వెరైటీ తిట్లు తనకు అలవాటే. కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవద్దు’ అంటూ టీఆర్ఎస్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విశాఖ పర్యటనను విజవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు పయనమవనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా రామగుండం వెళ్లనున్నారు. అక్కడి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
రూ.10 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు ద్వారా నూతన అభివృద్ధి జరుగుతుందన్న ప్రధాని.. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ముగించారు..
లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడే అవకాశాలను వెదుకుతామన్న పీఎం.. ఆంధ్రప్రదేశ్ లో నూతన సాంకేతికత ద్వారా సముద్ర లోతుల్లో ఇంధనాన్ని వెలికి తీయడం శుభపరిణామమన్నారు. దేశంలో నీలి విప్లవం ద్వారా విశేష మార్పులు తీసుకువచ్చామన్నారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. పేద వారు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల ద్వారా దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది.
మా ప్రతి నిర్ణయం సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసమే. నేడు ఓ పక్క జీఎస్టీ, గతిశక్తి, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాలు, పైపు లైన్.. మరోవైపు.. పేదవారి సంక్షేమం కోసం ఎన్నో విధానాలు చేస్తున్నామని, వాటిని పెంచుకుంటూ పోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశంలోని వెనకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం, పేదవారికి ఉచిత బియ్యం అందిస్తున్నామని వివరించారు. డ్రోన్ నుంచి గేమింగ్ వరకు, స్పేస్ నుంచి స్టార్టప్ ల వరకు మా విధానాలు నవతరానికి కొత్త అవకాశాలు అందిస్తున్నాం.
ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏపీ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉంది. కొన్ని దేశాలు ఆహార సంక్షోభం, మరి కొన్ని దేశాలు ఇంధన సంక్షోభంతో అవస్థలు పడుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా భారత్.. అనేక సవాళ్ల మధ్య కొత్త ఎత్తులు చేరుకుని సరికొత్త అభివృద్ధిని నమోదు చేస్తోందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని వివరించారు. నేడు భారతదేశం ప్రపంచం ఆలోచనలనకు కేంద్ర బిందువుగా మారిందని వివరించారు.
వికసించిన భారత్ లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్నామని ప్రధాని చెప్పారు. తెలుగు వారు ప్రపంచంలోని నలుమూలలా తమ మార్క్ ను చూపిస్తున్నారన్నారు. వారి కలుపుగోలు తనం కారణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని వివరించారు. రైల్వేలు, రోడ్లు, నిర్మాణ రంగాల్లో విశేష ప్రగతి సాధించామని వివరించారు. మౌళిక సదుపాయాల కోసం ప్రత్యేక పద్ధతి ప్రారంభించామన్నారు. ఎకనామికల్ కారిడార్ లో భాగంగా ఆరు లైన్ల రోడ్డు సదుపాయం ఉంది. పోర్టు వరకు చేరేందుకు ప్రత్యేక నిర్మాణం ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఫిషింగ్ హార్బర్ ను ఆధునికీకరిస్తున్నారు.
భారత వ్యాపారం రంగంలో విశాఖపట్నం ముఖ్య పాత్ర పోషిస్తోందని ప్రధాని అన్నారు. కేంద్ర బిందువుగా మారిందన్నారు. పది వేల కోట్ల ప్రాజెక్టులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశం కల్పించిన విశాఖ వాసులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. పథకాలు, మౌళిక సదుపాయాల ద్వారా సులభతర జీవితానికి మార్గం ఏర్పడిందని చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును కలిసినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడేవారన్నారు. వారు రాష్ట్రంపై చూపించే ప్రేమానురాగాలు కొలవలేనివని కొనియాడారు.
ప్రియమైన సోదరీ, సోదరులకు నమస్కారం అంటూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో పాటు ఆసీనులైన అందరికీ ప్రధాని నమస్కారం చెప్పారు. కొన్ని నెలల క్రితమే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జన్మదిన వేడుకలు జరుపుకున్న సమయంలో తాను ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాయసహకారాలు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న సీఎం.. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన గాయం నుంచి ఇంకా కోలుకోలేదని చెప్పారు.
కార్తీక పౌర్ణమి రోజున ఎగసిపడిన సముద్ర కెరటాలకు మించి, జన సముద్రాన్ని తలపించేలా ప్రజలు తరలివచ్చారని చెప్పారు. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
విశాఖ బహిరంగ సభా వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తు్న్నారు. ప్రధాని మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలికారు. దేశ ప్రగతి రథ సారథి పీఎం మోడీ అని ప్రసంగం ప్రారంభించారు. ఉత్తారంధ్ర గడ్డపై ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలోని సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానానికి వచ్చారు. సభా వేదికకు ముందుగానే చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి స్వాగతం పలికారు.
విశాఖపట్నంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ 40 నిమిషాలు మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు 7 నిమిషాల సమయం కేటాయించారు. సుమారు రూ.15, 233 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పాతపట్నం – నరసన్నపేట రహదారిని జాతికి అంకితం చేయనున్నారు. తూర్పు తీరంలో ఓఎన్జీసీ యూ ఫీల్డ్ , ఐఓసీఎల్, గ్రాస్ రూట్ డిపో, విజయవాడ – గుడివాడ – భీమవరం – నిడదవోలు రైల్వే లైన్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నర్సాపురం రోడ్ల అభివృద్ధి పనుల్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
ప్రధాని సభకు దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11 మధ్య అత్యవసరమైతే బయటకు రావాలని కోరారు. ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామన్న అధికారులు.. తమకు సహకరించాలని కోరారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి శనివారం ఉదయం నుంచే అమలులోకి వచ్చాయి. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలు సబ్బవరం, అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం, పెందుర్తి మీదగా మళ్లిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మద్దిలపాలెం, పెద వాల్తేరు, కురుపాం సర్కిల్, స్వర్ణ భారతి స్టేడియం ప్రాంతాల్లో రాకపోకలపై నిషేధం విధించారు. వాహనదారులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథుల కోసం మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే ఆశీనులవుతారు. రెండో వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యే, ఎమ్మేల్సీలు, జీవిఎల్, సోము వీర్రాజు సహా 15 మంది నేతలకు అవకాశం కల్పించారు. మూడో వేదికలో 300 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు.
ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ల పర్యటనతో విశాఖలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ప్రతి 50 అడుగులకు ఒక పోలీస్ ఉండేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ తో పాటు 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభా ప్రాంగణం వద్ద 3,500 మంది విధుల్లో ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ భద్రత ను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరం అయిన పనులు ఉంటే తప్ప నగర వసూలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు. బహిరంగ సభకు వచ్చే వాహనాల కు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధానికి.. గవర్నర్ బిశ్వభూషణ్‌హరిచందన్, సీఎం జగన్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. మారుతి జంక్షన్ నుంచి కిలోమీటర్ మేర నిర్వహించిన రోడ్‌షోలో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. రోడ్‌షోలో భారీగా బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తర్వాత ఈస్ట్ నావెల్ హెడ్ క్వార్టర్‌లోని ఐఎన్ఎస్ చోళ సూట్‌లో ప్రధాని బస చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ హరిచందన్.. బస నేపథ్యంలో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రతి 50 అడుగులకు ఒక పోలీస్ మోహరించారు. డీజీపీతో పాటు 30 మంది ఐపీఎస్ లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 7వేల మంది విశాఖలో పహారా కాస్తుండగా.. ఏయూలో సభకు 3వేల 500 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.