తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం (Pithapuram) లో మున్సిపల్ అధికారుల నిర్వాకం బయటపడింది. పన్నులు చెల్లించలేదనే కారణంతో రెండు ఇళ్లకు తాళాలు వేశారు. మోహన్‌నగర్‌లోని సత్తిబాబు, రమణ ఇళ్లకు అధికారులు తాళం (Lock) వేసి సీల్ చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నా వారిని అలాగే ఉంచి, బయటి నుంచి తాళం వేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. మోహన్ నగర్‌లో చాలా మంది వైసీపీ నేతల ఇళ్లకు రూ.లక్షల్లో పన్ను బకాయిలు ఉన్నా.. వారి జోలికి వెళ్లకుండా టీడీపీ (TDP) నేతలపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా అందించలేని అధికారులు.. ప్రజలపై పన్నుల భారం వేయడమేంటని నిలదీశారు. స్థానికులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో గొర్ల సత్తిబాబు ఇంటికి వేసిన తాళం, సీల్‌ను సిబ్బంది తొలగించారు. రమణ ఇంటికి మాత్రం నిన్న సాయంత్రం నుంచి తాళం, సీల్ అలాగే ఉంచారు. ప్రస్తుతం ఈ అంశం పిఠాపురంలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో జరిగిన ఘటనలో చెత్త పన్ను చెల్లించలేదని.. కర్నూలు కార్పొరేషన్ అధికారులు షాపుల ముందు చెత్త వేశారు. నగరంలోని కొండారెడ్డి బురుజు (Kondareddy Buruzu) సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లారు. ఆస్తి, నీటి పన్ను, దుకాణాలకు ట్రేడ్ లైసెన్సుల రుసుము చెల్లిస్తున్నామని దుకాణాదారులు చెప్పారు. మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ సమాధానంలో సహనం కోల్పోయిన నగరపాలక సంస్థ సిబ్బంది.. నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్లో తీసుకొచ్చి దుకాణాల ముందు పడేసి వెళ్లారు. ఈ ఘటనతో సంబంధిత దుకాణాల యజమానులు అవాక్కయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా చెత్త పన్ను వసూలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి విచిత్రమైన పన్నులు వసూలు చేస్తున్నారని వాపోయారు.
Also Read
Viral Video: ఈ బుడ్డోడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. క్షణం ఆలస్యం అయ్యిఉంటే ..