AP Politics: నెల్లూరులో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. రైతులకు అండగా ఈనెల 7వ తేదీన జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. రాష్ట్రంలో తుఫాన్ వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు రూ.35 వేల నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. వాటిలో తక్షణ సాయంగా రూ.10 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. రెండు రోజుల్లో ఈ పరిహారాన్ని రైతులకు అందజేయాలని ప్రభుత్వానికి జనసేనాని అల్టీమేటం జారీ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతు కన్నీరు పెడితే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండదన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని పేర్కొన్న పవన్.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాలని వైసీపీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఇదే సమయంలో మద్యపాన నిషేధంపై సీఎం జగన్ ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు విడతలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ జగన్.. అధికారంలోకి వచ్చాక రక రకాల బ్రాండ్ల పేరుతో మద్యాన్ని ఏరులా ప్రవహింపజేస్తున్నారని తూర్పారబట్టారు. మద్యం అమ్మకాల ద్వారా రూ.16 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని, దానిని వరదల కారణంగా నష్టపోయిన రైతులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ సూచించారు.