పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం

Panchadarla Illegal Mining: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మైనింగ్ అనుమతుల రద్దు, సంస్థపై కఠిన చర్యలు, పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
Pawan Kalyan

Updated on: Jul 22, 2026 | 10:06 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పంచదార్ల కొండలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను  ఆదేశించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన మైనింగ్ సంస్థకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని, సంస్థపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచదార్ల కొండను శాశ్వతంగా “నో మైనింగ్ జోన్”గా ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి సంపద, పర్యావరణ సమతుల్యత   దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

అక్రమ తవ్వకాల వల్ల జలధారలు, భూగర్భ జల వనరులు, పర్యావరణంపై ఎంత మేర ప్రభావం పడిందో అంచనా వేసేందుకు శాస్త్రవేత్తల బృందంతో ప్రత్యేక అధ్యయనం నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. శాస్త్రీయ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పర్యావరణానికి నష్టం కలిగించిన అదే మైనింగ్ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించాలని కూడా ఆయన సూచించారు. దెబ్బతిన్న కొండ ప్రాంతాన్ని తిరిగి సహజ స్థితికి తీసుకురావడం, వృక్ష సంపదను పునరుద్ధరించడం, జల వనరులను సంరక్షించడం వంటి చర్యలను సంస్థతోనే చేపట్టించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పంచదార్ల ప్రాంతంలోని పురాతన ఆలయాలు, చారిత్రక వారసత్వ సంపద, ప్రకృతి వనరులను కాపాడటం ప్రభుత్వం, సమాజం అందరి బాధ్యత అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, వారసత్వ సంపదను ధ్వంసం చేసే చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని హెచ్చరించారు.

పంచదార్ల ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us