Pawan Kalyan: గతంలో రుషికొండకు రాకుండా అడ్డుకున్నారు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

విశాఖపట్నంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు.. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ శుక్రవారం రుషికొండలో పర్యటించారు. రుషికొండకు చేరుకున్న ఆయన అక్కడి భవనాలను పరిశీలించారు. పవన్‌ కల్యాణ్ వెంట పలువురు జనసేన ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.

Pawan Kalyan: గతంలో రుషికొండకు రాకుండా అడ్డుకున్నారు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
Pawan Kalyan

Updated on: Aug 29, 2025 | 3:53 PM

విశాఖపట్నంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు.. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ శుక్రవారం రుషికొండలో పర్యటించారు. రుషికొండకు చేరుకున్న ఆయన అక్కడి భవనాలను పరిశీలించారు. పవన్‌ కల్యాణ్ వెంట పలువురు జనసేన ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు. రుషికొండ టూరిజం భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవన నిర్మాణాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. టూరిజం భవనాల రెనొవేట్‌ చేస్తామని.. ఉన్నవి పడగొట్టి కొత్త భవనాలు కట్టారన్నారు. చెట్లను నరికేసి పర్యావరణాన్ని దెబ్బతీశారన్నారు.

రుషికొండ భవనాల నిర్మాణంలో మట్టి అమ్ముకుని అవినీతికి పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రూ. 450 కోట్లు ఖర్చు పెట్టిన భవనంలో అప్పుడే పెచ్చులు ఊడుతున్నాయన్నారు. ఇంజనీర్లతో రుషికొండ భవనాల సేఫ్టీ ఆడిట్ జరిపించాలని సూచించారు. గతంలో టూరిజం శాఖకు ఏడాదికి రూ. 7కోట్ల ఆదాయం వచ్చేది.. ఇప్పుడు ఏడాదికి రూ.కోటి కరెంట్ బిల్లులు చెల్లించాల్సి వస్తోందన్నారు. లేపాక్షి ద్వారా ఫర్నీచర్‌ కొన్నట్టు బిల్లులు చేసుకున్నారని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. గతంలో తమను రుషికొండకు రాకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు.

గతంలోనూ రుషికొండ భవనాలను పరిశీలించారు పవన్‌ కల్యాణ్. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుషికొండ భవనాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. ఈ క్రమంలో ఇవాళ పవన్‌ మళ్లీ భవనాలను పరిశీలించడంతో ప్రాధాన్యత ఏర్పడింది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..