ఆన్‌లైన్ వ్యాపార మోసాల పట్ల ఎంత అలెర్ట్ చేసినా ప్రజల్లో అవేర్‌నెస్ రావడంలేదు. మోసగాళ్లు కూడా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నట్టేట ముంచేస్తున్నారు. తాజాగా.. గుంటూరు జిల్లాలో మరో ఘరానామోసం బయటపడింది. పది రూపాయలు పెట్టుబడి పెట్టండి.. 20 రూపాయలు ఇస్తాం.. వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసి.. రెండొందలు బెనెఫిట్ పొందండి.. ఇదీ.. ఈ మధ్యకాలంలో గ్రామాల్లో అమాయక ప్రజలను మోసం తీరు. ఇలా ముంచేసే మోసగాళ్ల మాటలు నమ్మి జనం భారీగా నష్టపోతున్నారు.
తాజాగా.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన మోసం.. మరీ డిఫరెంట్ అని చెప్పొచ్చు. అమాయక ప్రజలను మరింత అత్యాశకు గురి చేశారు కేటుగాళ్లు. 11వేలు కట్టండి.. నాలుగు నెలల్లో 64 వేలు వస్తాయ్.. లక్ష రూపాయలు కట్టండి.. సంవత్సరానికి 13లక్షల 94 వేలు పొందండి.. అంటూ.. ప్రజల్ని గట్టిగా నమ్మించింది పాట్నా గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఇంకేముంది.. రూపాయికి రెండు రూపాయలంటేనే చటుక్కున నమ్మేసే జనం… 11వేలకు 64వేలు అంటే ఎందుకు నమ్మరు. ఎస్.. గుంటూరు జిల్లా ప్రజలు కూడా పాట్నా గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఆఫర్‌ను గుడ్డిగా నమ్మేశారు. ఈ క్రమంలోనే.. పాట్నా గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏజెంట్‌గా ఆన్‌లైన్ ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ప్రజలను పరిచయం చేసుకున్నాడు శ్రీకాకుళానికి చెందిన జనార్ధన్.
వాట్సాప్‌లో పంపిన లింక్‌తో పెట్టుబడులు పెట్టారు గుంటూరుకు చెందిన అరుణకుమారి, పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన యాసిన్, నవీన్. ఎవరికి వారు లక్షల్లో సెండ్ చేశారు. అయితే.. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గానే.. బ్లాక్ లిస్టులో పడేశాడు మోసగాడు. అంతేనా.. కొన్నాళ్లకు ఏకంగా ఆన్‌లైన్ దుకాణం బంద్ చేయడంతో మోసపోయామని గుర్తించారు బాధితులు.. లబోదిబోమంటూ స్పందన కార్యక్రమంలో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు నాలుగున్నర లక్షలు మోసపోయామని.. నిందితులను అరెస్ట్ చేసి.. న్యాయం చేయాలని వేడుకున్నారు బాధితులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..