Andhra Pradesh: ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు.. ఈ కథ తెలిస్తే అయ్యో అనాల్సిందే..

ఆ గ్రామంలో చనిపోయాక కూడా కష్టాలు తప్పడం లేదు. కడసారి వీడ్కోలు పలికే అంతిమ యాత్ర ఒక సాహసయాత్రలా మారుతోంది. భుజంపై శవం.. నడుము లోతు నీరు.. ఎప్పుడు వాగు ఉధృతి పెరుగుతుందో తెలియని భయం.. ప్రకాశం జిల్లాలో పసుపుగల్లు గ్రామం దుస్థితి ఇది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత మధ్య ఆ గ్రామస్థులు నరకయాతన పడుతున్నారు.

Andhra Pradesh: ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు.. ఈ కథ తెలిస్తే అయ్యో అనాల్సిందే..
Pasupugallu Village Cremation Struggles

Edited By:

Updated on: Feb 09, 2026 | 9:11 PM

ఆ ఊళ్లో అంతిమ యాత్రకు అనంత కష్టాలు తప్పడం లేదు. తనువు చాలించిన భౌతికకాయాన్ని చివరి మజిలీకి తరలించాలంటే ఏరు దాటాల్సి రావడంతో అష్టకష్టాలు పడుతున్నారు. మోకాలి నుంచి నడుము లోతు ప్రవహించే ఏరుదాటి కిలో మీటరు నడిస్తే తప్ప అంతిమసంస్కారాలు అస్కారం లేకుండా పోతోంది. పొలాలకు వెళ్ళాలంటే కూడా నిత్యం ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా పొలాలకు వెళ్ళే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా వినతలు బుట్టదాఖలే అవుతున్నాయి. ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో ఎవరు చనిపోయినా అంతిమసంస్కారాలు నిర్వహించాలంటే ప్రాణం మీదకు వస్తోంది. మృతి చెందిన బంధువులను మహాప్రస్థానంలో చివరి మజిలీ చేయించేందుకు నానాతంటాలు పడుతున్నారు.

ఈ గ్రామం నుంచి హిందూ శ్మశానికి వెళ్లాలంటే మధ్యలో చిలకలేరు దాటాల్సిందే. దీంతో గ్రామంలో ఎవరు మృతి చెందినా అంతిమ సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్మశానవాటిక పసుపుగల్లు గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో చిలకలేరు వాగు ఎన్నాళ్ళ నుంచో ఇబ్బందులు పెడుతోంది. మోకాలి నుంచి నడుములోతు ప్రవహించే చిలకలేరు వాగు దాటుతూ ప్రమాదకర పరిస్థితుల్లో మృతదేహాలను తీసుకెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో అయితే మోకాలి లోతు నీరు ఉండే వాగులో వర్షాకాలం వస్తే చాలు నడుములోతు నీరు ఉంటుంది. ఒక్కోసారి వాగు ఉధృతి ఎక్కువైతే ప్రాణాలను తెగించాల్సి వస్తోంది. నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ట్రాక్టర్లలో తీసుకెళ్ళవచ్చు. అలాకాకుండా వాగు ఉధృతి ఎక్కువగా ఉంటే భుజాలపై ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు.

ప్రస్తుతం వాగులో నీరు నడుములోతు నీరు ఉండటంతో శనివారం మృతి చెందిన గ్రామానికి చెందిన గూడాల అంజిరెడ్డి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గ్రామానికి చెందిన రైతుల పొలాలు కూడా అటువైపే ఉండటంతో ముఖ్యంగా మహిళలు వాగు దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి దుస్థితి దాపురించింది. ఎన్నోఏళ్ళుగా తమ గ్రామంలో నెలకొన్న ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటూ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని పసుపుగల్లు గ్రామస్థులు వేడుకుంటున్నారు.