AP: పెద్దపులి సంచారం.. ఆ 11 గ్రామాలకు అలర్ట్ జారీ చేసిన అటవీ శాఖ!

పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలో పెద్దపులి సంచారం ఏలూరు జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పులి అడుగుజాడలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై చేపల వేట, బోట్లను నిలిపివేశారు. పులిని గుర్తించి తిరిగి అడవిలోకి తరలించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

AP: పెద్దపులి సంచారం.. ఆ 11 గ్రామాలకు అలర్ట్ జారీ చేసిన అటవీ శాఖ!
Tiger

Edited By:

Updated on: Jun 24, 2026 | 11:15 AM

ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల సమీపంలో పులి అడుగుజాడలు, కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా పలు ముందస్తు చర్యలు చేపట్టారు.

గోదావరి నదిలో చేపల వేటతో పాటు పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అవసరమైతే పులిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు మత్తుమందు బృందాలు, ప్రత్యేక బోన్లను సిద్ధంగా ఉంచారు. ఉప్పారేల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో ముంజులూరు, కోటూరుపల్లి, వీరన్నపాలెం, చింతలగూడెం తదితర గ్రామాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలు అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఒంటరిగా అడవి మార్గాల్లో తిరగవద్దని, చెరువులు, వాగులు, నది ఒడ్డున చేపల వేటకు వెళ్లకూడదని తెలియజేస్తున్నారు. పశువులను బయట ప్రదేశాల్లో కట్టేయకుండా రాత్రివేళ భద్రత కలిగిన పాకల్లో ఉంచాలని సూచించారు. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తగినంత వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అవసరం లేకుండా బయట సంచరించవద్దని కూడా సూచనలు జారీ చేశారు. పులి కదలికలపై నిఘా కొనసాగుతోందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారులకు సహకరించాలని కోరారు. అయితే జిల్లాలో పెద్దపులి సంచారం వార్తలు వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు చేపడుతున్న చర్యలతో పులిని సురక్షితంగా గుర్తించి అడవిలోకి మళ్లిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us