
పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన సాంబయ్య పదేళ్లుగా కారంపూడిలో ఒక గోల్డ్ షాపులో పనిచేస్తున్నాడు. దీంతో ఇతనికి బంగారు షాపులకు ఆభరణాలు విక్రయించే వారి వివరాలు తెలుసు. ఎవరెవరూ ఆభరణాలు ఎప్పుడెప్పుడు షాపులకు తీసుకొస్తారో ఇతనికి పక్కా సమాచారం ఉంటుంది. దీంతో ఎలాగైనా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను చోరి చేయాలని మనసులో అనుకున్నాడు. అనుకున్న వెంటనే రంగంలోకి దిగాడు. తనక్కొడితోనే చోరి సాధ్యం కాదని భావించి ఒక ముఠాను తయారు చేశాడు. సాంబయ్య తన మనసులోని మాటను ముందుగా గుంటూరులోని గుజ్జన గుండ్లలో ఉండే పవన్‌తో చెప్పాడు. పవన్ తనకు స్నేహితులైన శశికుమార్, సాయి కిరణ్, నిఖిల్ మహేష్, బండారు అజిత్ లతో ఒక టీమ్‌ని ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌కు పవన్ నాయకత్వం వహిస్తే… సాంబయ్య ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా ప్లాన్ వేసుకున్నారు. అనుకున్న విధంగానే వినుకొండ నుండి యక్కల శ్రీనివాసరావు అనే హోల్ సేల్ వ్యాపారి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను తయారు చేయించి వాటిని కారంపూడిలోని షాపులకు తీసుకెళ్తాడని సాంబయ్య పవన్ కు చెప్పాడు.
గత నెల 27న మధ్యాహ్నం వ్యాపారి శ్రీనివాసరావు కారంపూడికి బస్సులో చేరుకున్నాడు. ఒక షాపులో ఆభరణాలు ఇచ్చి మిగిలిన ఆభరణాలతో కూడిన బ్యాగ్ తీసుకొని హోటల్‌కు బయలు దేరాడు. అదే సమయానికి రెండు బైక్‌లపై నిందితులు దూసుకొచ్చారు. శ్రీనివాసరావు చేతిలోని బ్యాగ్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిఘటించిన శ్రీనివాసరావు మెయిన్ రోడ్డులోని సందులోకి పరిగెత్తాడు. ఫెర్టిలైజర్స్ షాపులు అధికంగా ఉండే ఆ సందులో అంతా నిర్మానుష్యంగా ఉంది. ఫెర్టిలైజర్స్ షాపుల బంద్ కు పిలుపునివ్వడంతో అన్ని షాపులు క్లోజ్ అయి ఉన్నాయి. శ్రీనివాసరావును వెంబడించిన ఇద్దరికి ఆ తర్వాత మరోబైక్‌పై వచ్చిన మరొక ఇద్దరూ తోడయ్యారు. నలుగురు కలిసి శ్రీనివాసరావుపై దాడి చేసి బ్యాగ్ లాక్కొని పారిపోయారు. ఈ దోపిడి వ్యవహారమంతా సిసి కెమెరాల్లో రికార్డు అయింది.
శ్రీనివాసరావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. అయితే మొదట ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దోపిడికి ముందు మెయిన్ రోడ్డులో అటు ఇటు తిరిగిన బైక్ లను అబ్జర్వ్ చేశారు. ఒక బైక్ పై వచ్చిన నిందితులు కూల్ డ్రింక్ కొనుగోలు చేసి ఫోన్ పేలో డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులకు సాంబయ్య విషయం తెలిసి పోయింది. దీంతో అందరిని అరెస్ట్ చేసి అరవై లక్షల రూపాయల విలువ చేసే 566 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.