
అక్కడ వందల సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.. చదువుకోవాలనే తపన ఉంది.. పెద్దయ్యాక ఏదో సాధించాలనే కలలు. కానీ, ఆ కలలను తీర్చే గురువులే లేరు. అక్షరాలు నేర్పాల్సిన బడి.. ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 150 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఆ స్కూల్లో ఉన్నది కేవలం ఒక్కరంటే ఒక్కరే ఉపాధ్యాయుడు, ఆయన కూడా పాపం.. తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇటీవల సర్జరీలు కావడంతో ఆయన కూడా మెడికల్ లీవ్‌లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ ఒక్క మాస్టారు కూడా సెలవుపై వెళ్తే.. ఆ 150 మంది చిన్నారులకు అక్షరాలు దిద్దించే నాథుడెవరు? వారి భవిష్యత్తు ఏమవ్వాలి? విద్యా కుసుమాలు వికసించాల్సిన చోట.. ఆవేదనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇది ఎక్కడో అడవుల్లోనో, మారుమూల లంక గ్రామాల్లోని కథ కాదు. కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి పై ప్రత్యేక కథనం..
కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 150 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ తరచూ సెలవు తీసుకుంటున్నారు. ఇటీవల సర్జరీ లు కావడంతో మెడికల్ లీవ్‌లో వెళ్లాలని ఆ ఉపాధ్యాయుడు యోచిస్తున్నారు. ఆయన కూడా మెడికల్ లీవ్ పెడితే పాఠశాలకు దిక్కులేకుండా పోతుందని విద్యార్థులు ఆందోళన చెందుతూ శనివారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఉన్న ఆ ఒక్క ఉపాధ్యాయుడు కూడా మెడికల్ లీవ్ లో వెళితే చదువు చెప్పేనాథుడు లేక చిన్నారుల చదువులు అటకెక్కి తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ, ఈ పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కూడా నియమించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, విద్యావంతురాలైన ఓ యువతిని నియమించుకుని నెట్టుకొస్తుండగా, ఇప్పుడు ఆ యువతి అక్కడి 151 మంది విద్యార్థులకు దిక్కుగా మారారు. ఒకవైపు ఉపాధ్యాయుల కొరతతో అల్లాడుతుంటే, మరోవైపు పాఠశాల భవన నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉండి విద్యార్థులను వేధిస్తోంది. ఆ అసంపూర్తి భవనంలోనే పిల్లలు భయం గుప్పిట్లో చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, డీఈఓలు స్పందించి, తక్షణమే డిప్యూటేషన్ పద్ధతిలో ఉపాధ్యాయులను నియమించి పిల్లల భవిష్యత్తు ను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..