గ్రామంలో గానీ, వీధిలో గానీ రోడ్డు వేసేటప్పడు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్డు మధ్యలో చెట్లు, స్తంభాలు వంటివి లేకుండా జాగ్రత్త పడతారు. అంతే కాకుండా రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తుంటారు. కానీ ఓ చోట మాత్రం అధికారులు అవేమీ పట్టించుకోలేదు. వచ్చామా, రోడ్డు వేశామా, వెళ్లి పోయామా అనే ధరోణితో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది చూసిన గ్రామస్థులు, నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ రోడ్డుపై ఎలా రాకపోకలు సాగించాలని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ కొత్త కాలనీలో వేసిన అంతర్గత రహదారి పరిస్థితి ఇది.
గ్రామంలో ఇది గతంలో మట్టిబాటగా ఉండేది. అక్కడే చేతిపంపు ఉండేది. అవసరాలు తీర్చుకునేందుకు గ్రామస్థులు దీనిని ఉపయోగించుకునేవారు. ఇటీవల ఇక్కడ సీసీ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయి. దీంతో చేతిపంపు రోడ్డు మధ్యలో వస్తుందని తెలిసినా అలాగే సీసీ పోసి, చదును చేశారు. దారి మధ్యలో చేతిపంపు వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీ రోడ్డు వేసేటప్పుడే చేతిపంపు తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి గురించి కొత్తగా తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.