ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల హడావిడి మొదలైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు మంగళవారం(డిసెంబర్ 3) నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. మరి, రాజ్యసభ రేసులో ఎవరున్నారు?. ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారు?. అన్నదీ ఆసక్తికరంగా మారింది.
వైఎస్ఆర్సీపీ సభ్యులుగా కొనసాగిన మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు, అర్ కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రాజీనామాలు రాష్ర్టంలో మారిన అధికారం, రాజకీయ పరిణామాలకు అనుగుణంగా జరిగాయన్నది విశ్లేషకుల భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కి రాజీనామా చేసినా తిరిగి టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, బీజేపీ నుంచి అర్ కృష్ణయ్యలు తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీదా మస్తాన్ రావు టీడీపీ తరపున, అర్ కృష్ణయ్య బీజేపీ తరపున అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. వీరిద్దరికీ 2028 వరకు పదవీ కాలం ఉంది.
టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు
బీద మస్తాన్ రావు తొలుత తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కావలి టీడీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశా.రు చంద్రబాబుకి అత్యంత సన్నిహితమైన నేతగా కూడా ఎదిగారు. అయితే, 2019 ఎన్నికల్లో కావలి నుంచి ఓడిపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేత విజయ సాయిరెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన విజ్ఞప్తి మేరకు 2022లో రాజ్యసభకు ఆ పార్టీ తరఫున వెళ్లారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఘన విజయం సాధించడంతో తిరిగి ఆయన తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తన రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరడం, చంద్రబాబు అందుకు అంగీకరించడంతో తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారు.
బీజేపీ నుంచి అర్. కృష్ణయ్య..!
బీసీ ఉద్యమ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్య ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడంతో అనేక విశ్లేషణ జరిగాయి. అయితే బీసీ ఓట్ బ్యాంకు కోసం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కథనాలు వచ్చాయి. దాన్ని తగ్గట్టుగానే ఆర్ కృష్ణయ్య కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించి బీసీలను పార్టీతో మమేకం అయ్యేటట్టు చేసే ప్రయత్నం చేశారు. కానీ 2024 ఎన్నికల్లో దారుణమైన పరాజం తర్వాత కూడా కృష్ణయ్య పార్టీ మారుతారని ఎవరు ఊహించలేదు.
గతంలో తెలుగుదేశం బీజేపీ కూటమి తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగి ఎల్బీనగర్ శాసనసభ్యులుగా ఎన్నికైన అర్. కృష్ణయ్య తర్వాత కాలంలో వైఎస్ఆర్సీపీ లు చేరడం, మళ్ళీ ఆ పార్టీకి, రాజ్యసభ కు రాజీనామా చేయడంపై రకరకాల కథనాలు వినిపించాయి. ఆశ్చర్యంగా బీజేపీ అర్. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని తిరిగి రాజ్యసభకు పంపడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
మోపిదేవి స్థానానికి సానా సతీష్..?
మోపిదేవి వెంకట రమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం టీడీపీ నేత సానా సతీష్ కు దక్కే అవకాశముందని సమాచారం. 2026 వరకు రెండేళ్ల పాటు ఉండే పదవీ విషయంలో నిర్ణయంపై టీడీపీ కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పార్టీలు అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, చివరికి సానా సతీష్ పేరును ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పలువురి ప్రయత్నాలు
ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలో సీనియర్లు పలువురు అనేక ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ల కోట నుంచి అయితే కంభంపాటి రామ్మోహన్ తోపాటు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజులకు కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. అదే సమయంలో గల్లా జయదేవ్ కు కూడా పదవి రావచ్చన్న ఊహగానాలు వచ్చాయి. జనసేన నుంచి నాగేంద్రబాబుకి ఒక స్థానాన్ని ఇస్తారని అన్నప్పటికీ పదవులపై తన పెద్దగా ఆసక్తి లేదంటూ స్వయంగానే ట్వీట్ చేయడంతో దానికి తెరపడింది. ఇలా అనేక మంది రాజ్యసభ కోసం ప్రయత్నించినప్పటికీ ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల మేరకు తిరిగి బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తో పాటు కొత్తగా సానా సతీష్ కి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..