
నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. సింగనమల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులు భువనేశ్వరిని కలిశారు. తమకు జన్మించిన మగ పిల్లాడికి పేరు పెట్టాలని వారు భువనేశ్వరిని కోరారు. దీంతో కుశల్ కృష్ణ అని ఆ బాలుడికి భువనేశ్వరి నామకరణం చేశారు. తమ బిడ్డకు భువనేశ్వరి నామకరణం చేయడం పట్ల హేమంత్ యాదవ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం 4:10 గంటలకు పుట్టపర్తి, శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి తిరుగు పయనం కానున్నారు.
నిజం గెలవాలి పేరుతో పరామర్శ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు వార్త విని కన్నుమూసిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఓవైపు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూనే.. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారు. బిడ్డల్లాంటి కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమన్నారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయన ధ్యాస అంతా ప్రజలు, కార్యకర్తల గురించేనని అన్నారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడి చూపిన అభిమానం ఎప్పుడూ మరువలేనిదన్నారు.
ప్రతీ జిల్లాను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు శ్రమించారని భువనేశ్వరి గుర్తు చేశారు. కాని, ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు చేయడం, కేసులు పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెంబర్ వన్‌గా మారిపోయిందని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుపై ప్రజలకున్న అభిమానం చూసి తాను చాలా గర్వపడుతున్నానని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..