
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట సమీపంలో వివాహిత మల్లెల దుర్గా స్రవంతిని హతమార్చిన అచ్చి నరసింహారావు అలియాస్ పెదబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. స్రవంతిని 21సార్లు కత్తితో పొడిచాడు నరసింహారావు. మే 1న జరిగిన ఈ దారుణం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.
21ఏళ్ల క్రితం కులాంతర వివాహం
నందిగామకు చెందిన రవికుమార్‌ను స్రవంతి 21ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఓ కొడుకు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 8ఏళ్ల క్రితం విడిపోయారు. అయితే రవికుమార్ ఫ్రెండ్ నరసింహారావుతో సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. మూడేళ్లుగా స్రవంతి -నరసింహారావు సహజీవనం కొనసాగింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.. స్రవంతిపై దాడి చేసి హతమార్చాడు నరసింహారావు. అది కూడా మామూలుగా కాదూ.. కత్తితో 21సార్లు పొడిచాడు. తీవ్రగాయాలపాలైన స్రవంతిని ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది.
గతంలో నరసింహారావుపై రౌడీషీట్
సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నరసింహారావుకి సంబంధించి చాలా విషయాలు బయటికొచ్చాయి. వేర్వేరు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో పాటు రౌడీషీట్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు వారాలకు పైగా నరసింహారావు కోసం గాలిస్తున్న పోలీసులు.. శుక్రవారం అరెస్ట్ చేశారు. స్రవంతి -నరసింహారావు మధ్య 20లక్షల వ్యవహారంపై గొడవలు జరిగాయని.. ఆ తగాదే హత్యకు దారితీసిందన్నారు పోలీసులు.
అండగా ఉంటానని నమ్మించి సహజీవనం చేసిన నరసింహారావు.. స్రవంతిని చంపిన తీరు అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. ఇలాంటి వాళ్లు సమాజంలో ఉండొద్దని.. కఠినమైన శిక్షలు వేయాలంటున్నారు నందిగామవాసులు.