Andhra: 3 నెలల పాటు నల్లమల అభయారణ్యం క్లోజ్ – ఇష్టకామేశ్వరి ఆలయానికి కూడా నో ఎంట్రీ

నల్లమల అభయారణ్యంలో జులై 1 నుంచి మూడు నెలల పాటు వరుసగా జన సంచారంపై నిషేధం విధించారు. దీంతో నల్లమలలో ఉన్న ఆలయాలకు గాని.. జంగిల్ సఫారీకి గాని జనం వెళ్లడానికి వీలు కుదరదు. ఈ క్రమంలో ఆయా మార్గాల్లో రహదారులు మూసివేశారు.

Andhra: 3 నెలల పాటు నల్లమల అభయారణ్యం క్లోజ్ - ఇష్టకామేశ్వరి ఆలయానికి కూడా నో ఎంట్రీ
Istakameswari Devi Temple

Edited By: Ram Naramaneni

Updated on: Jun 30, 2025 | 8:13 PM

జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పెద్ద పులుల సంతాన ఉత్పత్తికి అనుకూల సమయంగా అధికారులు భావిస్తున్నారు. ఆ సమయంలో పెద్ద పులుల మధ్య సంభోగం జరిగే అవకాశం ఉంది. మాములుగానే పెద్ద పులులు సిగ్గును కలిగి ఉంటాయి. సంభోగం సమయంలో శబ్ద కాలుష్యం జరిగితే సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుందని అటవీశాఖ అభిప్రాయానికి వచ్చింది. ఈ కారణంగానే మూడు నెలల పాటు నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో జన సంచారాన్ని పూర్తిగా నిలిపివేశారు. నిడమల ఫారెస్ట్‌లో ఎకో టూరిజం, జంగిల్ టూరిజం రిసార్టులు మూసేస్తున్నారు. సుప్రసిద్ధ ఇష్టకామేశ్వరి ఆలయంతో పాటు నల్లమల అభయారణ్యంలో వెలసిన అనేక చారిత్రాత్మక ప్రతిష్టాత్మక ఆలయాలకు సైతం భక్తులు రాకుండా రహదారులు మూసేస్తున్నారు.

మూడు నెలలపాటు జనసంచారాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు రావడంతో చెంచులలో ఆందోళన నెలకొంది. నల్లమల అభయారణ్యంలోనే జీవరం సాగిస్తున్న చెంచులు తేనె, శీతల పానీయం నన్నారి, వెదురుతో తయారైన వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల పాటు జనసంచారం నిలిచి పోతే జీవనానికి ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో విస్తరించిన నల్లమల అభయారణ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12 వేల చెంచు కుటుంబాలు జీవిస్తున్నాయి. పెద్దపులులపై శ్రద్ధతో జనసంచారాన్ని నిలిపివేస్తున్న అధికారులు… తమ పట్ల, తమ జీవితం పట్ల కూడా సానుభూతి చూపాలని చెంచులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.