జ్ఞానవాపి మసీదులో శివలింగం గురించి నార్త్ టు సౌత్… నేషనల్ వైడ్ టాక్ షురూ అవుతోంది. అదే సందట్లో ఇటువైపు నుంచి ఏపీలో మరో శివలింగం లోకల్‌లో మరో పెద్ద మిస్టరీగా మారింది. కాకపోతే ఇక్కడ వివాదాస్పద అంశాలైతే ఏమీ లేవు. ఆసక్తికరమైన చారిత్రక అంశాలతోనే ముడిపడి వుంది ఈ పురాతన శివలింగం. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) స్పిల్‌వే అప్రోచ్ ఛానల్ కోసం జేసీబీలతో తవ్వకాలు జరుపుతుంటే భూగర్భం నుంచి బైటపడిన పురాతన శివలింగం ఇది. చూడగానే షాకైన లారీ డ్రైవర్లు, వర్కర్లు వెంటనే పనులన్నీ ఆపి శివలింగాన్ని గట్టుపై పెట్టి గోదావరి జలాలతో(Godavari Water) భక్తి శ్రద్దలతో కడిగి శుభ్రం చేశారు. అపురూప శివలింగం బైటపడిందన్న వార్తతో వెంటనే అలర్టయింది పురావస్తు శాఖ. పరిశీలనలు జరిపి.. అది 12వ శతాబ్దానికి చెందిన శివలింగంగా తేల్చేశారు. పట్టిసీమ(Pattiseema) ఆలయంలోని శివలింగం.. ఇప్పుడు బైటపడ్డ శివలింగం దాదాపు ఒకేలా ఉండడంతో ఆ దిశగా పరిశోధన జరుగుతోంది. చాళుక్యుల పాలనలో 800 ఏళ్ల కిందట గోదావరి తీరం వెంబడి అనేక శివాలయాలు నిర్మించారని.. వాటిలో ఇదీ ఒకటని చెబుతున్నారు. పాతికేళ్ల కిందట పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపితే… రెండో శతాబ్దం నాటి ఇటుకలు, ఆలయాల ఆనవాళ్లు బైటపడ్డాయి. వాటన్నిటితో పాటు, 375 గ్రామాల్లో దొరికిన మిగతా పురాతన వస్తువుల ప్రదర్శన కోసం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ శివలింగం కూడా ఆ మ్యూజియంలోకే వెళ్లబోతోందా… లేక గుడి కట్టి.. పునఃప్రతిష్ట చేస్తారా… చూడాలి మరి.