
మనం ఎంత ఉన్నత స్థానంకి చేరుకున్నా మన మూలాలను మరిచిపోకూడదంటారు పెద్దలు. ఈ విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తి ఏపి రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఊపిరి సలపకుండా ఎంతో బిజీగా ఉంటూ కూడా.. నిమ్మల రామానాయుడు తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగర్తిపాలెంలో తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో సొంతంగా వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తారు. రబీ సీజన్లో ఆయన ఆరు ఎకరాల్లో సన్నరకం వరిని సాగు చేసి మంచి దిగుబడిని సాధించారు. మొత్తం ఆరు ఎకరాల్లో 390 బస్తాలను పండించారు. అంటే ఎకరాకు 65 బస్తాలు చొప్పున పండించారు. సాధారణంగా ఎకరాకు 50 బస్తాలు పండిస్తే గొప్పగా చెప్పుకుంటారు. కానీ మంత్రి నిమ్మల రామానాయుడు వరి నాట్లు వేసినప్పుడు నుంచి ఎప్పటికప్పుడు వాటి సంరక్షణను చూసుకుంటూ.. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు స్వయంగా ఎరువులు జల్లడం పురుగుమందులు పిచికారి వంటివిచేసేవారు. అందుకే ఆయన పొలంలో మంచి దిగుబడి వచ్చింది.
మంత్రి నిమ్మల తన వ్యవసాయ పొలంలో ఎకరాకు 65 బస్తాలు పండించడంతో నియోజకవర్గంలోని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు తాము కూడా మంత్రి బాటలో అధికారుల సూచనలతో వ్యవసాయం చేస్తామని అంటున్నారు. మొత్తానికి రామానాయుడు మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మన్ననలు, ప్రజల మన్ననలను పొందడమే కాకుండా రైతుగా కూడా మేటిగా పేరు తెచ్చుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..