Nandigama: వరద ఉధృతిలో బ్రిడ్జ్ దాటే యత్నం.. మధ్యలో…

|

Aug 31, 2024 | 2:02 PM

వాతావరణ విభాగం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి..

Nandigama: వరద ఉధృతిలో బ్రిడ్జ్ దాటే యత్నం.. మధ్యలో...
Andhra Floods
Follow us on

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. విజయవాడను భారీవర్షం ముంచెత్తింది. నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ఆగకుండా కురుస్తున్న వానతో రోడ్లపై మోకాళ్లోతు వరద నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో వరదలో ముందుకు సాగలేక బైకర్లు అవస్థలు పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం రాముకోరి కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ విరిగిపడడంతో ఓ రేకుల ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. గంపలగూడెం మండలం తోటమాల- వినగడప మధ్య కట్టలేరు వాగుకు వరద పోటెత్తడంతో 20 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టుప్రాంతాల్లో వరద ఇళ్లల్లోకి చేరుతోంది.

నందిగామలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది.  ముప్పాళ్ల దగ్గర బైక్‌తో బ్రిడ్జ్ దాటే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. దీంతో వరద ధాటికి.. బైక్‌తోపాటు నీటిలో కొట్టుకుపోయాడు. అయితే ఓ చెట్టు కొమ్మ దొరకడంతో.. దాన్ని పట్టుకుని ప్రాణాన్ని నిలుపుకున్నాడు. స్థానికులు అతడిని రెస్క్యూ చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావానికి ఉమ్మడి గుంటూరు జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల ఓ మోస్తరుగా.. మరికొన్నిచోట్ల భారీగా వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీవర్షం కురుస్తోంది. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగువంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పెదకూరపాడు మండలం పరస దగ్గర కాలచక్ర రోడ్డుపై వరదప్రవాహానికి రాకపోకలు ఆగిపోయాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడుకావడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.