Andhra Pradesh: బయోడీజిల్ బంకులో పేలుడు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. స్పాట్‌లోనే..
రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్ వద్ద బయోడీజిల్ బంక్‌లో డీజిల్ ట్యాంక్ పేలింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బయో డీజిల్ అన్‌లీడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్ వద్ద ఉన్న ఒక బయోడీజిల్ బంక్‌లో డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంక్‌లో డీజిల్ నింపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.పేలుడు తీవ్రంగా ఉండడంతో మంటలు క్షణాల్లో బంక్ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మంటల అదుపుకు యత్నం
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీజిల్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తుతున్నారు. ఈ ప్రమాదంతో పాలువాయి జంక్షన్ వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది. బంక్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
