
వారిది కర్ణాటక.. ఏడుగురు స్నేహితులు కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు మంత్రాలయం వచ్చారు.. ఈ క్రమంలో.. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు.. ఈ క్రమంలో కాలు జారి ఓ స్నేహితుడు నీటి లోతులోకి వెళ్లి మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు మరో ఇద్దరు నీటిలోకి దూకారు.. అలా ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు.. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో శనివారం చోటుచేసుకుంది. కర్నాటకలోని హసన్‌లో ఒకే కాలేజీలో ఏడుగురు యువకులు డిగ్రీ చదువుతున్నారు. రెండు రోజులు సెలవులు రావడంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం హసన్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని శనివారం ఉదయం దర్శించుకున్నారు.
సాయంత్రం వేళ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వెనుక భాగంలో ఉన్న పుష్కర ఘాటు దగ్గర పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకున్నారు. ఏడుగురు మిత్రులు కలిసి నదిలోపలకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక స్నేహితుడి కాలు జారి వరద ప్రవాహానికి నీటి లోపలికి వెళ్లిపోయాడు. అతన్ని పట్టుకోవడం కోసం ఇంకా ఇద్దరు కూడా నీటి ప్రవాహంలోకి వెళ్లారు.. ఇలా హాసన్ కి చెందిన అజిత్, సచిన్, ప్రమోద్ .. ముగ్గురు కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. మరో నలుగురు ఎలాగోలా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. ప్రాణస్నేహితులు నదిలో గల్లంతు కావడంతో వీరు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో తుంగభద్ర తీరం శోకసంద్రంగా మారింది.
Mantralayam
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన కర్నాటకలోని హసన్ కు చెందిన ముగ్గురు యువకులు శనివారం సాయంత్రం 5 గంటలకు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ ఆదివారం లభ్యమైందని తెలిపారు.
తుంగభద్ర నదిలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పుట్టిల ద్వారా పోలీసులు, గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, రెస్క్ టీం, మత్స్యకారులు వేర్వేరుగా 3 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరధ్వాజ్, డీఎస్పీ ఉపేంద్ర బాబు నేతృత్వంలో ఈ గాలింపు చర్యలు కొనసాగాయి.. తుంగభద్ర నది లో గల్లంతైన వారి గురించి మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆరా తీశారు. వారి కుటుంబసభ్యులకు అవసరమైన సేవలు అందించాలని గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..