Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 కోసం గొడవ పడుతున్న ఇద్దరు వ్యక్తులు.. మధ్యలో వచ్చిన మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఘర్షణ ఎందుకని సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తే.. నువ్వు ఎవరు అంటూ కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన జిల్లాలోని ప్ర పుల్లలచెరువు SC పాలెంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ పాలెంలో గ్లాట్సన్, నవీన్ ల మధ్య 500 రూపాయల విషయంలో గొడవ జరుగుతోంది. ఇది గమనించిన అదే వీధిలో ఉండే అన్న తమ్ముళ్ళు రావూరి ఆశీర్వాదం, ఆనందరావు గొడవను నివారించేందుకు వెళ్ళారు. అయితే, మా గొడవతో మీకెం సంబధం అంటూ నవీన్, అతని తండ్రి రూబేన్ లు కత్తులతో, ఆశీర్వాదం, ఆనందరావు లపై దాడి చేసారు. తీవ్ర గాయాలు అయిన వీరిద్దరిని యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, మార్గ మధ్యలోనే ఆశీర్వాదం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక గుండెపై తీవ్ర గాయమైన ఆనందరావు పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కుటుంబ పెద్ద దిక్కు ఆశీర్వాదం హత్యకు గురవటంతో బార్య బిడ్డలు కన్నీరుమున్నీరయ్యారు.