శభాష్ పోలీస్.. విద్యార్థిని భవితను కాపాడిన మల్కాపురం ఇన్స్‌పెక్టర్..!
విశాఖపట్నంలో ఆదివారం (మే 03) జరిగిన నీట్-2026 ప్రవేశ పరీక్షలో ఒక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు చూపిన మానవత్వం ఒక విద్యార్థిని డాక్టర్ కల చెదిరిపోకుండా కాపాడింది. విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన మల్కాపురం ఇన్స్‌పెక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

పార్వతీపురం నుండి వచ్చిన బెహరా హిమబిందు అనే విద్యార్థిని, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ నంబర్-2 లో నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో తన వద్ద ఉండాల్సిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు మర్చిపోయినట్లు గుర్తించింది. సమయం గడిచిపోతుండటం, ఫోటోలు లేనిదే లోపలికి అనుమతించమని అధికారులు చెప్పడంతో ఆ విద్యార్థిని దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరైంది.
అక్కడ విధుల్లో ఉన్న మల్కాపురం సి.ఐ. గొలగాని అప్పారావు ఆ బాలిక ఆవేదనను గమనించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. తన సిబ్బందిలో ఒక కానిస్టేబుల్‌ను అప్రమత్తం చేశారు. సొంత ఖర్చులతో సదరు కానిస్టేబుల్ బైక్‌పై విద్యార్థినిని తీసుకుని శ్రీహరిపురంలోని ఫోటో స్టూడియోకు వెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే ఫోటోలు తీయించి, తిరిగి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
మల్కాపురం సి.ఐ. అప్పారావు చొరవతో హిమబిందు సకాలంలో ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లి పరీక్ష రాయగలిగింది. ఒక నిమిషం ఆలస్యమైనా ఏడాది కష్టం వృథా అయ్యే పరిస్థితుల్లో, పోలీసులు స్పందించిన తీరును చూసి అక్కడ ఉన్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతలే కాదు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఆపద్బాంధవులు అని కొనియాడారు. సకాలంలో స్పందించి విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన మల్కాపురం పోలీసులకు సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు అందుతున్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..