అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 7 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి,ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా-గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీంతోపాటు.. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు అమృత్‌సర్, పాటియాలా, నజీబాబాద్, బస్తీల గుండా ప్రయాణిస్తూ, గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తీర ఒడిశా & వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడన ప్రాంత కేంద్రం మీదుగా వెళ్లి, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సెప్టెంబర్ 7 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు.. ఉరుములు మెరుపులతోపాటు.. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
మంగళవారం ఏపీ వెదర్ రిపోర్ట్..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణ వాతావరణం..
తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు.. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముంది.
