
అమరావతి, నవంబర్ 17: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం మరింత చురుకుగా కదులుతుంది. దీని ప్రభావంతో నేటి నుంచి తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం భరీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచనలు జారీ చేసింది.
రేపు కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల అవకాశముంది. ప్రకాశం,శ్రీసత్యసాయి,వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నేడు, రేపు రెండు రోజుల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 తేదీల మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. కొన్ని చోట్ల 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు 10 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ జిల్లాలలో 6 నుండి 10 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సిర్పూర్.. 7.4, శేరిలింగంపల్లి.. 10, రామచంద్రాపురం.. 11.4, రాజేంద్రనగర్.. 11.9, చందానగర్.. 12.5 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.