మేనమామతో పెళ్లి.. 4ఏళ్ల కుమారుడు.. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి మరో యువకుడితో ప్రేమ.. చివరకు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హరిణి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వివాహిత హరిణిని స్వగ్రామానికి రప్పించి, ఆమె తల్లి, తాత, భర్త కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ, హరిణి ముందుగానే రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారింది.

మేనమామతో పెళ్లి.. 4ఏళ్ల కుమారుడు.. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి మరో యువకుడితో ప్రేమ.. చివరకు
Srikakulam Harini Murder Case

Edited By:

Updated on: Jun 10, 2026 | 9:22 PM

కన్న తల్లే వివాహితురాలైన తన కుమార్తెను కడతేర్చిన దారుణ ఘటన ఇది. దానికి మృతురాలి భర్త, మామ సహకరించటం మరో విశేషం. హైదరాబాద్ లో ఉంటూ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వివాహితను పథకం ప్రకారం స్వగ్రామానికి రప్పించి హతమార్చారు. తర్వాత ఆమె గుండెపోటుతో మృతి చెందింది అని చెప్పి గుట్టుగా దహనసంస్కారాలు చేసేసారు. అయితే అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేసేసరికి ఆమెది సాధారణ మరణం కాదు.. హత్య అని తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోర్లిగాం గ్రామంలో దారుణం జరిగింది. దుంపల హరిణి (24)అనే వివాహిత తన ఇంటిలో దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసింది ఇంకెవరో కాదు ఆమె కన్నతల్లి పైల విజయకుమారి, ఆమె తాత బలుసాకు. అయితే ఇందులో ఆమె భర్త దుంపల దంతేశ్వరరావు హస్తం ఉంది. ఈనెల 1వ తేదీ రాత్రి దుంపల హరిణినీ సోర్లిగాం లోని ఆమె నివాసంలో గుట్టుగా హత్య చేసేసారు ముగ్గురు నిందితులు. ఆమె గుండెపోటుతో మృతి చెందింది అని చెప్పి తెల్లవారుజామున ఆమె మృతదేహానికి గుట్టుగా దహన సంస్కారాలు కానిచ్చేశారు. అయితే అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా ఆమెది సాధారణ మరణం కాదు హత్య అని తేలింది. మృతురాలి తల్లి, తాత, భర్త హంతకులనీ తేల్చారు పోలీసులు. ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు పోలీసులు..

మేనమామతో వివాహం.. గ్రూప్స్ కోచింగ్ అని చెప్పి..

మృతురాలు హరిణికి 2020 లో టెక్కలి మండలం సోర్లిగాం గ్రామానికి చెందిన సొంత మేనమామ అయిన దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. ఈ దపంతులకు 4ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగానే హరిణికి పెద్దలు వివాహం జరిపించారు. అయితే తర్వాత డిగ్రీ పూర్తి చేసిన హరిణి గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ కి వెళ్ళింది. చదువుకి ఇబ్బందిగా ఉండటంతో తన కుమారుడిని తల్లి పైల విజయకుమారి వద్ద వదిలి ఆమె S.R. నగర్ లోనీ ఓ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్ కోచింగ్ తీసుకునేది. ఈ క్రమంలోనే S.R. నగర్ కి చెందిన సుధా నాగేంద్ర ఆమె లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు. తన కోచింగ్ మీట్ అయిన సుధా నాగేంద్రతో లివింగ్ రిలేషన్ చేస్తూ వచ్చింది హరిణి. విషయం భర్తకు తెలియటంతో భర్త దంతేశ్వరరావు, తల్లి విజయకుమారిలు.. హరిణికి గట్టిగా మందలించారు. అయిన ఆమె వెనక్కి తగ్గకపోగా.. తనకు దంతేశ్వరావు నుండి విడాకులు కావాలని, ప్రియుడు సుధా నాగేందర్ ను వివాహం చేసుకుంటానని బహిరంగంగానే చెప్పింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు హరిణికి ఎన్ని విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినలేదు.. పైగా తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది హరిణి.

పథకం ప్రకారం హరిణి హత్య.. కేసులో కీలక ఆధారంగా హరిణి సెల్ఫీ వీడియో..

హరిణి ఎన్ని విధాలుగా నచ్చజెప్పి ఊరికి తీసుకువద్దామని కుటుంబసభ్యులు ప్రయత్నం చేసిన లాభం లేకాపోయింది. హరిణి తమను వదిలి నాగేంద్రతో వెళ్లిపోతే తమ పరువు పోతుందని భావించిన కుటుంబ సభ్యులు చివరకు ఆమెను హతమార్చాలని భావించారు. దానికోసం ముందస్తు ప్రణాళికను రచించారు. నీ ఇష్టప్రకారం విడాకులు ఇచ్చేందుకు దంతేశ్వరరావు అంగీకరించాడని గ్రామానికి వస్తే పెద్ద మనుషుల సమక్షంలో ఆ ప్రక్రియ కానిచ్చేద్దామని హరిణికి తల్లి సమాచారం ఇచ్చింది. దాంతో హైదరాబాద్ నుండి బయలు దేరి కిందట నెల 31న సోర్లిగాం గ్రామానికి చేరింది హరిణి. వాస్తవానికి 31వ తేదీ రాత్రే ఆమెను హతమార్చాలని అనుకున్నారు కానీ అది జరగలేదు.. దాంతో ఈనెల 1న రాత్రి 11గంటల 15నిమిషాల సమయంలో ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న హరిణినీ ఆమె తల్లి విజకుమారి కాళ్ళు రెండు గట్టిగా పట్టుకోగా… తాత బలుసాకు రాడ్ తో కొట్టి హరిణిని చంపేశారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని నమ్మబలికారు. తెల్లారితే ఆమె శరీరంపై ఉన్న దెబ్బలు చూసి ఎవరికైనా అనుమానం వస్తాదని భావించి తెల్లవారు జామునే మృతదేహానికి అంత్యక్రియలు చేసేసారు. హరిణి మృతదేహానికి రహస్యంగా దహన సంస్కారాలు నిర్వహించటంతో గ్రామంలో పలు అనుమానాలు చేలరేగాయి. పోలీసులకు సమాచారం అందింది. VRO ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అప్పటికే హరిని మృతి దేహానికి దహన సంస్కారాలు పూర్తి కావడంతో పోలీసులు వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. ఈ క్రమంలో హరిణి తన హత్యకు కొద్ది రోజులు ముందు తన ప్రియుడికి పంపిన సెల్ఫీ వీడియో పోలీసులకు కీలక ఆధారంగా నిలిచింది.

తన తల్లి విజయకుమార్ నుంచి వచ్చిన పిలుపుమేరకు తాను గ్రామానికి వెళుతున్నానని కానీ తనకు ప్రాణహాని ఉంది.. అని ఆమె ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. దీంతో పోలీసులు హరిణి కుటుంబ సభ్యులను తమ స్టైల్లో విచారించగా నేరాన్ని అంగీకరించారు. హరిణి భర్త దంతేశ్వరరావు జిల్లాలోని సారవకోట మండలంలో సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. హరిణిది సహజ మరణం అని అంతా నమ్మడంతో పాటు.. ఒకవేళ హత్య విషయం బయటపడిన నేరం తనపై పడకుండా ఉండేందుకు భర్త దంతేశ్వరరావు హరిణి హత్య జరిగే సమయానికి టెక్కలి లోని భవానీ థియేటర్ లో సినిమాకు వెళ్ళాడు. అయితే ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుల విచారణలో తేలడంతో మృతురాలి తల్లి విజయ కుమారి A -1 గా,A – 2గా తాత బలుసాకు, A -3 గా భర్త దంతేశ్వరావు ను పేర్కొంటూ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us