White fungus outbreak in Andhra pradesh : కర్నూలు జిల్లాలో వైట్ ఫంగస్ కలకలం రేపుతోంది. వెలుగోడు మండలం గుంతకందాలలో షేక్ జొల్లు బాషాకు వైట్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే బాధితుడిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్థానికంగా వైట్ ఫంగస్ లక్షణాలు బయటపడటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, బ్లాక్, వైట్ ఫంగస్ ల నేపథ్యంలో వాటికి సంబంధించి ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్ సరఫరా, నిల్వలపైన సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని, ఇందులో 1068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 14 మంది మరణించారని, కోవిడ్ లేకున్నా.. బ్లాక్ ఫంగస్ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1139 మంది కోవిడ్ సోకినవారు కాగా, 40 మందికి కోవిడ్‌రాకపోయినా బ్లాక్ ఫంగస్ వచ్చిందన్నారు. డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా వస్తోందని తెలిపారు.
బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని, మాత్రలను అవసరమైనంత మేర సిద్ధం చేసుకుంటున్నామని, అలాగే ప్రత్యామ్నాయ ఇంజక్షన్లుకోసం కూడా కృషిచేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Read also : Alipiri tollgate : తిరుమల టోల్‌గేట్ దగ్గర నేటి నుంచి ఫాస్ట్ ట్యాగ్.. పెంచిన టోల్ ధరలు అమల్లోకి..