ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన యువతి ఫేస్‌బుక్ ద్వారా ఓ యువకుడికి గాలెం వేసి ఏకంగా రూ.46 లక్షలు కాజేసింది. మోసపోయిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం (డిసెంబర్ 22) సదరు యువతిని అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే..
చిత్తూరుకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత (29) ఓ అనాథ ఆశ్రమంలో పనిచేసేది. కొన్ని కారణాల రిత్య ఆశ్రమం మూసివేయడంతో డబ్బు సంపాదనకు అడ్డదారులు తొక్కింది. దీంతో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులను ట్రాప్ చేసి, డబ్బు పంపమని కోరేది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని, ఫోన్ సంభాషణల ద్వారా చనువు పెంచుకుని, పెళ్లి చేసుకుందామని నమ్మబలికింది. ఐతే తన పేరుమీద రూ.7 కోట్లు బీమా ఉందని.. దీన్ని తీసుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాలని తెల్పింది. తన వద్ద అంతడబ్బు లేదని, డబ్బు సాయం చేయాలని సదరు వ్యక్తిని కోరింది. అపర్ణ మాటలు పూర్తిగా నమ్మిన ఆ వ్యక్తి విడతల వారీగా అపర్ణ ఖాతాకు రూ.46 లక్షలు జమచేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా ఎత్తకపోవడం అనుమానం కలిగిన బాధితుడు రాచకొండ సైబర్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అపర్ణను అరెస్టు చేసి, 5 సెల్‌ఫోన్లు, ఓ ట్యాబ్‌ను ఆమె వద్ద నుంచి స్వాదీనం చేసుకున్నారు.
మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్ చేయండి.