KRMB: గురువారం రాయలసీమ లిఫ్ట్‌ పనులను పరిశీలించనున్న కేఆర్ఎంబీ.. బృందంలో తెలంగాణ వాళ్లు ఉండొద్దన్న ఏపీ

|

Aug 04, 2021 | 9:57 PM

కృష్ణానది జలాల జలజగడంపై రివర్‌బోర్డు సభ్యులు రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు

KRMB: గురువారం రాయలసీమ లిఫ్ట్‌ పనులను పరిశీలించనున్న కేఆర్ఎంబీ.. బృందంలో తెలంగాణ వాళ్లు ఉండొద్దన్న ఏపీ
Krishna River
Follow us on

KRMB: కృష్ణానది జలాల జలజగడంపై రివర్‌బోర్డు సభ్యులు రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఏపీ సర్కార్‌ షరతు విధించింది. ఈ మేరకు KRMBకి ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.

గతంలో పలుమార్లు సందర్శించాలని భావించినా ఏపీ ప్రభుత్వం సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో పలు మార్లు వాయిదా పడుతూ రాగా.. ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో.. KRMB బృందం పర్యటించబోతోంది. ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి NGT నివేదికను ఇవ్వనుంది.

ఇప్పటికే కృష్ణారివర్‌బోర్డు సభ్యులు తమ టూర్‌పై ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంటే కానీ సాగునీరు, తాగునీటి అవసరాలకోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉండదని ఏపీ గట్టిగా వాదిస్తోంది. చెన్నైకు తాగునీటి సరఫరాతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వెళ్లే నీళ్లే ఆధారమని అంటోంది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొత్తది కాదని, తమ వాటా ప్రకారమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం అంటుండగా.. తెలంగాణ మాత్రం తప్పుపడుతోంది. అది అక్రమ ప్రాజెక్టుగా ఆరోపిస్తోంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా.. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని అంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు.. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎలాంటి నివేదికను ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

మంగళవారం జరిగిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమన్వయ భేటీకి.. తెలంగాణకు చెందిన సభ్యులు గైర్హాజరయ్యారు. గెజిట్‌ ప్రకారం ప్రాజెక్టుల స్వరూపంపై అభ్యంతరాలున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నందున వివరాలు ఇవ్వాలని బోర్డు సభ్యులు కోరగా అందుకు ఏపీ నిరాకరించింది. తెలంగాణ మాత్రం పూర్తిస్థాయి బోర్డు భేటీ జరిపాకే, సమన్వయ కమిటీ భేటీ జరపాలని కోరుతోంది. రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాక రెండోవారంలో పూర్తిస్థాయి భేటీ నిర్వహిస్తామని తెలిపారు KRMB సభ్యులు.

Read also: Dalita Bandhu: వాసాల‌మ‌ర్రి నుంచే ‘ద‌ళిత బంధు’, దళితుల అకౌంట్లలో రేపే 10 ల‌క్షల చొప్పున‌ జ‌మ‌.. సీఎం కేసీఆర్ ప్రకటన