కర్నూలు, జనవరి 22; కర్నూలు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని బుక్కాపురం గ్రామ శివారులో ఉన్న శివాలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని పంట పొలాల మద్య ఉన్న పాడుబడిన శివాలయంలో ఎవరూ గమనించ సమయంలో ఈ తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి పాడుబడిన పురాత శివాలయంలో గుప్తనిధులు ఉన్నాయంటూ దశాబ్దాల కాలంగా ప్రచారం సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఈ ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం శివాలయం లోపల పెద్ద గోతి తీసి గుప్తనిధుల కోసం అన్వేషించినట్లు గుర్తించారు. అనంతరం గమనించిన స్థానికులు జరిగిన ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుప్త నిధుల కోసం తవ్వకాల జరిపినట్లు విషయం తెలుసుకున్న మహానంది దేవస్థానం చైర్మెన్ మహేశ్వర రెడ్డి సంఘటన స్థలం చేరుకొని విచారించారు.జరిగిన ఘటన పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది ఎవరూ..? తవ్వకాల్లో ఏవైన నిధులు, విలువైన వస్తు సామాగ్రి దొరికిందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు, ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. తవ్వకాలు జరిపిన దుండగులు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందినవారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా దుండగులను పట్టుకుంటామని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..