జులై 26: ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న పంపాపతి, మానస దంపతుల కుమార్తె సంజన 9వ తరగతి చదువుతుంది. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు క్రికెట్‌లో బ్యాటర్‌గా సత్తా చాటుతుంది. ఐదేళ్ల కిందట ముందుగా సంజన తన తమ్ముడితో కలిసి క్రికెట్ ఆడటం నేర్చుకుంది. ఆటపై ఆసక్తి పెరగడంతో కోచ్ బాలాజీ రావు వద్ద క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటూ బ్యాటింగ్‌లో రాటుదేలింది. తండ్రి ప్రొత్సాహం కూడా తోడవ్వడంతో ఆమెకు ఎదురులేకుండా పోయింది. ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి అండర్ 15, అండర్ 19 కర్నూలు జిల్లా జట్టుకు ఎంపికయింది, భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదోని పట్టణానికి చెందిన క్రికెటర్ అంజనీ శర్వాణి స్ఫూర్తితో తాను సైతం భారత జట్టుకు ఆడతానని నమ్మకంగా చెబుతుంది క్రీడాకారిణి సంజన.
ఆదోని పట్టణం తిరుమల నగర్ లో నివాసం ఉంటున్న రాజేష్ శ్రావణి దంపతుల కుమార్తె వంశిక కూడా క్రికెట్‌లో సత్తా చాటుతుంది. బ్యాటింగ్‌లో టెక్నిక్ ప్రదర్శిస్తూ కోచ్‌లను సైతం ఆశ్చర్యపరుస్తుంది. దీంతో వంశికను కూడా అండర్ 15, అండర్ 19 కర్నూలు జిల్లా మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారు. సంజన, వంశిక మాత్రమే కాదు.. ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు క్రికెట్లో రాణిస్తున్నారు. వీరంతా ఈ నెల21 నుంచి తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల అండర్-19 మహిళా క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపులాని ఉవ్విళ్లూరుతున్నారు.
క్రికెట్ అంటే ఎక్కువగా బాయ్స్ ఆడే ఆట అని.. గతంలో పేరెంట్స్ ఎంకరేజ్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మన జాతీయ మహిళా క్రికెట్ జట్టు.. దుమ్ములేపుతుంది. దీంతో అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రికెట్‌లో రాణించాలని కలలు కంటూ.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..