
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటామని ప్రయాణికుల అనుకుంటుండగా బైక్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. గురువారం రాత్రి 43 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ట్రావెట్స్ బస్సులు కర్నూలుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. స్పీడ్‌లో ఉన్న బస్సు అదుపుతప్పి అటుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా బస్సులోకి వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి వేశాడు.
అయితే ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. డ్రైవర్ బస్సు ఆపడంతో నిద్రలేచిన ప్రయాణికులు.. బస్సులో మంటలను చూసి భయపడిపోయారు. కొందరు వెంటనే బస్సులోని ఎమర్జెన్సీ విండోలు ఓపెన్ చేసుకొని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొందరు బస్సులోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు తమ కళ్ల ముందే తోటి ప్రయాణికుల ప్రాణాలు బస్సులో కాలిపోతున్నా.. ఏం చేయాలో అర్థంకాక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఇలా ప్రమాదం నుంచి తప్పించుకున్న జశ్వంత్ అనే ఒక ప్రయాణికులు మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విండో లేకపోతే తాను కూడా బస్సులో కాలిపోయే వాడినని తెలిపారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో కాలిపోయిన మృతదేహాలను వెలికి తీసి హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారికి కూడా కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు ప్రమాదంలో 20 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. వారిలో 19 మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీశారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.