తమ పట్టణం జిల్లా కేంద్రం కావాలనేది నంద్యాల వాసుల నాలుగు దశాబ్దాల కల. అదెప్పుడు నిజమవుతందా అని.. నాటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు జనం. ఎట్టకేలకు.. మొన్నటి జిల్లాల పునర్విభజనలో… ఆ కల సాకారమైంది. అది కూడా జిల్లా కేంద్రమనుకుంటే… నంద్యాల పేరిట జిల్లానే ఏర్పడటంతో ఈ ప్రాంతవాసులు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పొచ్చు. అక్కడక్కడా అసంతృప్తి ఉన్నా… ఓవరాల్‌గా ఈ ప్రాంతవాసుల చిరకాల స్వప్నం.. జగన్ హయాంలో నిజమైందనే రికార్డు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పరిస్థితులేమైనా.. ఈ నవనందుల కోటలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయా? అంటే.. కచ్చితంగా అని చెప్పాల్సిందే. ఈ నియోజకవర్గానికున్న చరిత్ర… ఆ తర్వాత సంభవించిన పరిణామాలు.. ప్రస్తుత పరిస్థితులు… ఇవన్నీ బేరీజు వేసుకుంటే భవిష్యత్తు పాలిటిక్స్ ఎలా ఉంటయన్నది కీలకాంశమే అవుతుంది.
ప్రస్తుతం ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు శిల్పా రవి అలియాస్ రవిచంద్ర కిశోర్‌రెడ్డి. బలమైన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన రవి.. వచ్చేసారి కూడా గెలిచితీరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. సొంత పార్టీలోనూ ఆయనకు పెద్దగా అసమ్మతి లేదనే చెప్పొచ్చు. దీనికి కారణం శిల్పా కుటుంబానికి జిల్లారాజకీయలపై ఉన్న పట్టే. రవి తండ్రి శిల్పా మోహన్‌రెడ్డికి.. జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆత్మీయుడిగా ముద్రేసుకున్న మోహన్‌రెడ్డి… అప్పట్లో ఆయన కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. మోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణిరెడ్డి కూడా.. ప్రస్తుతం శ్రీశైలం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చట్టసభల్లో వీరి ప్రాతినిథ్యాన్ని చూసి.. జిల్లాలో రాజకీయంగా ఈ ఫ్యామిలీకి ఉన్న పట్టేమిటో అర్థం చేసుకోవచ్చు.
దశాబ్దాలుగా నంద్యాల నడిగడ్డపై… సై అంటే సై అంటున్నాయ్ భూమా, శిల్పా కుటుంబాలు. వాళ్లొక పార్టీలో ఉంటే.. వీళ్లింకో పార్టీలో ఉండేవారు. 2014కి ముందు వైసీపీలో చేరిన దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబం… ఆ తర్వాత టీడీపీ పంచన చేరింది. దీంతో, అప్పటికే టీడీపీలో ఉన్న శిల్పా కుటుంబంపై ఆ ప్రభావం పడింది. అంతేకాదు, నాగిరెడ్డి హఠాన్మరణంతో వచ్చిన ఉప ఎన్నికలోనూ భూమా బ్రహ్మానందరెడ్డికి సీటిచ్చారు చంద్రబాబు. దీంతో, హర్టయిన శిల్పా ఫ్యామిలీ వైసీపీలోకి జంపైంది. 2017లో జరిగిన ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున శిల్పామోహన్‌రెడ్డి పోటీచేయగా… హోరాహోరీ పోరులో టీడీపీదే విజయమైంది. అయితే ఏడాదిన్నర తిరగకముందే జరిగిన సాధారణ ఎన్నికల్లో… ప్రతీకారం తీర్చుకుంది వైసీపీ. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన శిల్పా రవి… భూమా బ్రహ్మానందరెడ్డిపై రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. 2024లోనూ ఫ్యాన్‌గాలి గట్టిగా వీచేలా కసరత్తులు చేస్తున్నారు.
తన తల్లి భూమాశోభ ప్రాతినిథ్యం వహించిన ఆళ్లగడ్డ నుంచి గెలిచి.. ఆ తర్వాత తండ్రితో కలిసి టీడీపీలోకి వెళ్లి… చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేసిన అఖిల ప్రియ… ఇప్పుడు నంద్యాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే భూమాదంపతుల వారసురాలిగా అఖిల ప్రియ రాజకీయాలు చేస్తుండగా.. మరో కూతురు భూమా మౌనిక కూడా అరంగేట్రం చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి గెలిచిన నంద్యాల స్థానం నుంచే పోటీచేయాలని మౌనిక భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, చెల్లికోసం అఖిలప్రియ.. పొలిటికల్ గ్రౌండ్‌ప్రిపేర్ చేస్తున్నారని సమాచారం. నంద్యాలలో లోకల్‌గా ఆఫీసు కూడా ప్రారంభించడంతో.. ఆ ప్రచారానికి బలం చేకూరింది. మరి, అదే నిజమైతే.. లేడీస్ సెంటిమెంట్ వర్కవుటై మౌనికకే టీడీపీ టిక్కెట్ దక్కితే… గతంలో సైకిల్ గుర్తుపై పోటీచేసి ఓడిన భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితేంటన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు, టీడీపీ నుంచి గతంలో మూడుసార్లు గెలిచి… మంత్రిగానూ పనిచేసిన ఫరూక్.. ఇక్కడ లక్కీయస్ట్ పొలిటీషియన్‌గా పేరొందారు. మైనార్టీ కోటాలో.. గతంలో డిప్యూటీ స్పీకర్‌గానూ ఆయనకు అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి ఫరూక్ ఫ్యామిలీ.. టీడీపీ తరపున పోటీచేయాలని ప్రయత్నం చేస్తుండటం… సైకిల్‌ను సతమతం చేసేలాగే ఉంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీ నుంచి పోటీ మొదలైన వేళ.. ఫరూక్ ఫ్యామిలీ సైతం పోటీకి సై అంటే…. పిట్టపిట్టపోరు పిల్లీతీర్చిందన్నట్టుగా ఎన్నికల్లో ప్రత్యర్థులకు లాభమయ్యేట్టుందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. మరి, అధిష్టానం ఎవరివైపన్నది త్వరగా తేలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
1952లో ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో… రాజకీయచైతన్యం ఎక్కువ. 16సార్లు ఎన్నికలు జరిగితే… నాలుగుసార్లు స్వతంత్రులు గెలవడమే దానికి ప్రతీక. ఐదుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టిడిపి… రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 1977లో నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జనతా పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి. ఆ తర్వాత ఆయన లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా ఎదగడంతో నంద్యాల ఖ్యాతి దేశ వ్యాప్తమైంది. ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన పీవీ నరసింహారావు… నంద్యాలను మరింత ప్రసిద్ధికెక్కేలా చేశారు. ఆ సమయంలోనే ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం, ఆర్‌ఎఆర్‌ఎస్ ఏర్పాటుతో పాటు.. సాగునీటికోసం ప్రణాళికలు పడ్డాయి. అదే, నంద్యాలకు కాస్త కలిసొచ్చిందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం నంద్యాల సీడ్ హబ్‌లా వెలుగొందడం వెనక నాటినేతల కృషే కారణమనేవారు లేకపోలేదు.
రెండులక్షల యాభైవేలకు పైగా ఓటర్లున్న నంద్యాలలో… ముస్లిం మైనార్టీలదే ప్రాబల్యం. ఆ తర్వాత స్థాయిలో రెడ్లు, బలిజ, ఎస్సీ మాల మాదిగలు ఉన్నారు. వైశ్యులు, వాల్మీకిలు, పెరికలు సైతం భారీగానే ఉంటారు. అయితే, సంఖ్య సంగతి ఎలా ఉన్నా… ఆర్థికంగా దమ్మున్న రెడ్లే రాజకీయంగా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. పార్టీ ఏదైనా 11సార్లు రెడ్లే విజయం సాధించారంటే నంద్యాలలో వారి ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నంద్యాలలో కమ్యూనిస్టులకూ, బీజేపీకి ఓటింగ్ ఉన్నా.. అది ప్రభావం చూపే స్థాయిలో లేదు. కులాల వారీగా ఓటర్లు.. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల వెంటే ఉండటం దీనికి కారణం కావొచ్చు. అయితే, వచ్చే ఎన్నికల్లో కీలక సామాజిక వర్గాలు ఎవరివెంట ఉంటారన్నదే ఇప్పుడు కీలకం.
నంద్యాలలో ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. సాగునీరు పుష్కలంగా ఉంది. వరి, అరటి కీలక పంటలు. ఆధునిక వ్యవసాయ విత్తనాల ద్వారా రికార్డు స్థాయిలో దిగుబడి సాధిస్తారు. మరి, ఇలాంటి చోట ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి… పాలన ఎలా ఉందంటే కొందరికి ఖేదం, మరికొందరికి మోదం అన్నట్టుంది. అయితే, తాను ప్రజలకిచ్చిన హామీల్లో దాదాపుగా అన్నీ నెరవేర్చానంటున్నారు ఎమ్మెల్యే. చెప్పనివి సైతం ఎన్నో చేశానంటున్నారు.
ఎమ్మెల్యే చెప్పిందాంట్లో అస్సలు వాస్తవం లేదంటున్నారు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా బ్రహ్మానందరెడ్డి. రాష్ట్రంలో అంతటా జరిగినట్టుగానే నంద్యాల కూడా జిల్లా కేంద్రం అయ్యిందనీ.. దీంట్లో ఎమ్మెల్యే ఘనతేమీ లేదనీ కొట్టిపారేస్తున్నారు. అభివృద్ధి జరగకపోగా.. నియోజకవర్గంలో క్రైమ్ రేట్ పెరిగిందని ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే పాలనపై నంద్యాల వాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఎమ్మెల్యే పనితీరును కొందరు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం అబ్బే.. అంత బాలేదంటూ పెదవి విరుస్తున్నారు. శిల్పారవి అందరికీ అందుబాటులో ఉంటారనీ కొందరంటే… వైసీపీ కార్యకర్తల కబ్జాలకు తెగబడుతున్నారని మరికొందరంటున్నారు.
కుందూ నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏడేళ్లయ్యింది. అయినా అసంపూర్తిగానే దర్శనమిస్తున్న ఈవంతెన.. నంద్యాల వాసులకు తీరని కలగానే మిగిలింది. వరదపొంగితే.. అటూ, ఇటూ రాకపోకలు బంద్ కావాల్సిందే. 2017లో పునాది రాయివేసుకున్న ఈ బ్రిడ్జి.. ఎప్పటికి పూర్తవుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు.
నంద్యాల రాజకీయమంటే భూమా, శిల్పా కుటుంబాల మధ్యే పోరు నడిచేది. అయితే, అధికార పక్షంలో ఆశావహుల హడావుడి కనిపించకపోయినా… ఈ సారి ప్రతిపక్ష టీడీపీలో టిక్కెట్ వార్ తప్పేలా లేదు. ఇప్పటికే బ్రహ్మానందరెడ్డికి అఖిల, మౌనిక రూపంలో ఇంటిపోరు మొదలవగా.. మాజీ మంత్రి ఫరూక్ లేదా ఆయన తనయుడు ఫిరోజ్ కూడా పోటీకి సై అంటుండటం.. లోకల్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. మరి, అభ్యర్థుల విషయంలో పార్టీల వైఖరేంటి? ఎన్నికల్లో నంద్యాల జనం ఓటెవరికి? అన్నదే తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం