అలకలు, బుజ్జగింపులు, ఆధిపత్య పోరు, అసమ్మతి.. ఏదేమైనా.. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. తాజాగా.. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.. రాజీనామా ఆమోదం పొందాక వైసీపీలో చేరుతానంటూ స్పష్టంచేశారు. అంతేకాదు చంద్రబాబుపైనా, పార్టీ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన కేశినేని నాని.. వైసీపీలో చేరికపై చర్చించారు. అంతేకాకుండా.. పలు రాజకీయ విషయాలపై కూడా చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు పచ్చి మోసగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందని.. తన కుటుంబంలో చిచ్చుపెట్టారంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం జగన్ తో భేటీ అనంతరం కేశినేని నాని ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేశినేని నాని లోక్ సభ స్పీకర్ కు పంపించారు. రాజీనామా ఆమోదం పొందాక వైసీపీలో చేరతానంటూ ప్రకటించారు.
ఇదిలాఉంటే.. కర్నూలు వైసీపీలో ముసలం కాకరేపుతోంది. వైసీపీకి కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్ రాజీనామా చేశారు. పార్టీకి, ఎంపీ పదవికి సంజీవ్‌కుమార్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం తెరపైకి వచ్చారు. అధిష్టానం జయరాంకు ఎంపీ టికెట్ కన్‌ఫామ్ చేయడంతో.. సంజీవ్ కుమార్ అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..